Friday 20 January 2017

viss study material in telugu

  1. తెలుగు దేశము
  2. తెలుగుదేశ చరిత్ర
    • ఆధారములు
    • పురాతనస్థల ఖనన పరిశోధన
    • తెలుగుదేశ చరిత్ర - యుగ విభాగము
    • చరిత్ర పూర్వ యుగము
    • పూర్వ యుగము
      • సాతవాహనులు
      • ప్రాచీన కళింగదేశ చరిత్ర
      • ఇక్ష్వాకులు
      • బృహత్ఫలాయనులు
      • శాలంకాయనులు
      • ఆనందగోత్రులు
      • విష్ణుకుండి వంశజులు
      • పల్లవులు
      • బాదామి చాళుక్యులు
      • రాష్ట్రకూటులు
      • పూర్వ చాళుక్యులు
      • పూర్వ గాంగులు
    • పూర్వ మధ్య యుగము
      • కల్యాణీ చాళుక్యులు
      • చాళుక్య చోళులు
      • కాకతీయులు
      • అర్వాచీన గాంగవంశము
    • ఉత్తర మధ్యయుగము
      • అర్వాచీన గాంగవంశము (పరిశేషము)
      • ఓఢ్రగజపతులు
      • ముసునూరి వంశపాలనము
      • రాచకొండ, దేవరకొండ రాజ్యములు
      • కొండవీటి రెడ్డిరాజ్యము
      • బహ్మనీరాజ్యము
      • విజయనగర సామ్రాజ్యము
        • సంగమ వంశము
        • సాళువ వంశము
        • తుళువ వంశము
        • అరవీటి వంశము
        • గోలకొండ కుత్బ్‌శాహి వంశము
    • ఆధునిక యుగము
      • అసఫ్‌జాహి నిజాం రాజ్యము
      • బ్రిటిష్‌ ప్రభుత్వము
      • స్వాతంత్ర్యోద్యమము
      • ఆంధ్రోద్యమము
      • ఆంధ్రప్రదేశావతరణము
3.    ఆంధ్రపదము ఆంధ్రదేశమునకును, జాతికిని, భాషకును వర్తించును. అంధ్ర యన్నదే ప్రాచీనరూపమని, ఆంధ్ర యన్నది అర్వాచీనరూపమని ప్రాచీన తామ్రశిలాశాసనములను, వాఙ్మయమును పరిశీలించినచో తెలియగలదు. బౌద్ధపాలీవాఙ్మయమున ఆంధ్రులు 'అంధకు'లని వ్యవహృతులయినారు. అచ్చయిన సంస్కృత పురాణేతిహాసములలో అంధ్ర, ఆంధ్ర రూపములు రెండును కానవచ్చును. 'ఆంధ్ర' అను రూపము వానిలో నెప్పుడు ప్రవేశించెనో నిర్ణయించుటకు వీలులేదు. ప్రాచీనములైన తెలుగు తాళపత్ర గ్రంథములను చూచినను వానిలోను అంధ్రపదమే కనబడును. ఆంధ్రపదము క్రీస్తు శకము పదునాలుగవ శతాబ్దము కడపటి భాగమునను, పదునైదవ శతాబ్దిలోను వాడుకలోనికి వచ్చినదని శాసన పరిశీలనము వలన తెలియుచున్నది.
4.    అంధ్రపదము ఐతరేయమను ఋగ్వేదబ్రాహ్మణమునందే మొదటిమారు కానవచ్చును. బౌద్ధవాఙ్మయములో 'అంధకు'లను గురించిన ప్రస్తావము కలదు. 'సమంత పాసాదిక' అను బౌద్ధగ్రంథములో 'దమిళు'లతోపాటు 'అంధు'లుకూడ మ్లేచ్ఛులుగా పేర్కొనబడిరి. 'అంధులు', 'అంధకులు' ఒక్కరే కావచ్చును. బౌద్ధగ్రంథముల వలన గోదావరీతీరమున 'అంధకరట్ఠ' (అంధ్ర రాష్ట్ర) మొకటి కలదని, 'అస్స'కులు, 'అళ'కులు(ముళకులు) అంధ్ర రాజులని తెలియుచున్నది. బుద్ధునికాలమునాటికే గోదావరీతీరమున అంధ్రజనపదము లుండినట్లు విశదమగుచున్నది. తరువాత క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దములో మగధను పాలించిన చంద్రగుప్తమౌర్యుని యాస్థానమున నుండిన గ్రీకు రాయబారి యాంధ్రులనుగూర్చి ప్రస్తావించియున్నాడు. అశోక చక్రవర్తి శాసనములలో జాతిపరముగ అంధ్ర శబ్దము కానవచ్చును. అటుపిదప క్రీస్తుశకము నాలుగవ శతాబ్దారంభమునాటి పల్లవరాజుల ప్రాకృత శాసనములలో 'అంధాపథ'మను పేరుతో అంధ్రదేశము పేర్కొనబడినది. పథము, ఆపథము, మార్గము అను పదములు పూర్వము దేశవాచకములుగ ప్రయుక్తములైనవి. క్రీస్తుశక మారవశతాబ్దములో అంధ్రపదము జనులపరముగా మౌఖరివంశజుల శాసనములలో వాడబడినది. అంధ్రపదము జాతిపరముగ వాడినట్లు తెలుపు శాసనములు చాల కలవు. వీని నన్నిటినిబట్టి చూడగా అంధ్రము మొదట జాతివాచకమని, అంధ్రులు నివసించు దేశము అంధ్రరాష్ట్రమని, అంధ్రాపథమని స్పష్టమగుచున్నది. అంధ్రులకు దక్షిణమున ఉండిన తమిళులు వారిని 'వడుగర్‌' - ఉత్తరాదివారు - అని వాడుటచేత తమిళ శాసనములలో అంధ్రాపథమునకు 'వడుగవష్జి' అని ప్రయుక్తమయినది. వష్జి(வழி) అనగా మార్గము. అంధ్రాపథమునకు పడమటనున్న కొంత ప్రదేశమును పాలించిన ఒక బాణరాజు తాను అంధ్రమండలములోని ద్వాదశ సహస్ర గ్రామముల కధిపతినని, అంధ్రాపథ పశ్చిమదేశము ('వడుగ వష్జి మేఱ్కు')ను పాలించితినని చెప్పుకొనెను. అత డేలినది అంధ్రాపథములోని పండ్రెండువేల గ్రామముల దేశము. పూర్వము దేశవిస్తృతిని తెల్పుటకు గ్రామముల లెక్కను ఇచ్చువారు. బాణు లేలిన రాజ్యము అంధ్రమండలములో ద్వాదశ సహస్ర గ్రామ పరిమితమయినదని దాని యర్థము. సముద్రతీర స్థాంధ్ర దేశమును పరిపాలించిన వెలనాటి దుర్జయులు పండ్రెండవ శతాబ్దమునాటి తమ శాసనమొక దానిలో
5.    "పూర్వాంభోనిధి కాలహస్తిశిఖరి శ్రీమన్మహేంద్రాచల
శ్రీశైలై ర్వలయీకృతాంధ్రవిషయ"మ్మని
6.    తాము పాలించిన అంధ్రదేశవిభాగమునకు సరిహద్దులు తెలిపినారు. ఈరీతిని పూర్వ మాంధ్రదేశమున ఏ కొంత భాగముననో పరిపాలనము నెరపిన రాజులు తాము పాలించిన దేశము విస్తీర్ణము, హద్దులు తెలుపుచు వచ్చినారు; కాని, మొత్త మంధ్రదేశపు విస్తీర్ణముకాని హద్దులుకాని తెలియవు. అందువలన పూర్వము అంధ్రదేశము మొత్తము పరిమితిని కాని, దాని ఎల్లలు కాని తెలిసికొన వీలులేక పోవుచున్నది.
7.    తెలుగు అన్నమాట నిపుడు ఆంధ్రమునకు పర్యాయ పదముగా వాడుచున్నాము. ఆంధ్రపదముతో ఏమాత్రమును సాజాత్యములేని తెలుగు దానికి ఎట్లు ఎప్పటినుంచి పర్యాయపదమయ్యెనో తెలియదు. క్రీస్తుశకము పదివందలకు పూర్వపు శాసనములలోకాని, వాఙ్మయములోకాని తెలుగు అనుపదమే కానరాదు. తమిళ కన్నడ శాసనములలోను, ఆంధ్ర కర్ణాట వాఙ్మయములలోను తెలుగు పదము క్రీస్తుశకము పదునొకండవ శతాబ్దము ఆరంభమునుండియే కనబడును. శాసనములలో 'తెలుంగు భూపాలు'రు, 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ', 'తెలుంగదమల్ల' మొదలైన పదములు కానవచ్చును. ఈ శాసనములలోకూడ 'తెలుంగ', 'తెలింగ' పదము జనవాచకము లేదా జాతివాచకముగనే కనబడును. ఒక్క శాసనములో మాత్రము 'తెలుంగ నాడొళగణ మాధవియకెఱెయ' అని తెలుగుదేశములోని 'మాధవియకెఱె' అను గ్రామము పేర్కొనబడినది. ఇందు తెలుగునాడు అని తెలుగుదేశ ముదాహృతమైనది. ఆనాటికే అంధ్ర తిలింగ లేక తెలింగపదములు ఒకటే జాతిని దేశమును తెలుపుటకు అభేదముగ వాడబడినవి. తెలుగును దేశపరముగాను, జాతిపరముగాను వాడిన శాసనము లింకను ఉండవచ్చును. కాని అవి యన్నియు క్రీ. శ. పదవ శతాబ్దమునకు తరువాతివే కాని అంతకు పూర్వపువికావు. పూర్వోక్తోదాహరణముల ననుసరించి చూడగా తెలుగు రూపమే - అది తెలుంగు కానీ, తెలింగ కానీ - మొదటిది. పదునొకండవ శతాబ్ద మధ్య కాలమున పూర్వ చాళుక్య రాజరాజ నరేంద్రుని ఆస్థానమున నుండిన నన్నయభట్టారకుని నాటికి తెలుగు రూపాంతరముగా తెనుగు వచ్చినది. పదునాలుగవ శతాబ్దమునకు పూర్వమం దుండిన నన్నయ నన్నెచోడులు తెనుగును భాషాపరముగా వాడియున్నారు. పదుమూడవ శతాబ్దములోని మహమ్మదీయ చరిత్రకారులు ఈ దేశమును తిలింగ్‌ (తిలింగ) అని వ్యవహరించిరి. ఈ విధమున తిలింగ, తెలుంగు, తెలింగ పదములు దేశమును భాషను జాతిని సూచించు అంధ్రమునకు పర్యాయపదము లైనవి.
8.    తెలుగు, తెనుగు పదముల వ్యుత్పత్తి ఎట్టిది, అవి ఎందుండి పుట్టినవి అను విషయము గొప్ప వాదోపవాదములకు కారణమైనది. క్రీస్తుశకము పదునాలుగవ శతాబ్దము మొదటి పాదములో ఓరుగంటి కాకతి ప్రతాపరుద్రుని ఆస్థానమునం దుండిన విద్యానాథకవి తన ప్రతాపరుద్రీయములో ఈ దేశమును తిలింగ, తెలుంగ, తెలింగ అని కాక 'త్రిలింగ'మని వ్యవహరించి, శ్రీశైల, కాళేశ్వర, దాక్షారామములలోని మూడు శివలింగములవలన ఈదేశమునకు ఆ పేరు కలిగినట్లు
9.    "యై ర్దేశ స్త్రిభి రేష యాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా
యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాస శైలః కృతః
తే దేవాః ప్రసర త్ప్రసాదమధురాః శ్రీశైల కాళేశ్వర
ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్పచ్ఛ్రేయసే జాగ్రతు॥"
10.  అను శ్లోకములో సూచించియున్నాడు. ఈ శ్లోకము శైవ మతావలంబకుడయిన ప్రతాపరుద్ర చక్రవర్తినిగురించి చెప్పినది. కళింగము మినహాగా ఇప్పటి యాంధ్రదేశమునకంతకు కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ప్రభువగుటచేత శివ క్షేత్రములైన శ్రీశైల కాళేశ్వర దాక్షారామములను ఉజ్జాయింపుగా ఎల్లలుగా చెప్పి ఆ క్షేత్రములలోని శివలింగముల వలననే ఈ దేశమునకు త్రిలింగమను పేరు కలిగినట్లు కవి చమత్కరించినాడు. అంతియేకాని అంతకు పూర్వ మీదేశమునకు త్రిలింగమనుపేరు ఉండినట్లు వాఙ్మయములోకాని, శాసనములలోకాని ఎందును కానరాదు. కాకతి రాజన్యులు శైవులని, వారు పాలించిన కాలములో అంధ్రదేశములోని ప్రధాన మతము శైవమేయని మన మీ సందర్భమున జ్ఞాపకముంచుకొనవలసియున్నది. దీనిని బట్టి ఆంధ్రదేశమునకు త్రిలింగ మను పేరు శైవము ముమ్మరముగా వ్యాపించిన కాలమునందే వచ్చిన దనుట స్పష్టము. కాకతి ప్రతాపరుద్ర రాజ్యవిస్తృతిని చమత్కారముగ నిరూపించి 'తెలుగు'కు సార్థక్యము కల్పించుటకే త్రిలింగ పదము వాడబడినది. కాని, కొంద రనుకొనునట్లు త్రిలింగ పదము ప్రాచీనమును కాదు; తెలుగు త్రిలింగ, త్రికళింగ పదములనుండి కాని, తెనుగు త్రినగరమునుండి కాని రాను లేదు. త్రిలింగమని ఒకమారు వ్యవహారములోనికి వచ్చిన పిదప అది ఉచ్చరించుటకు గంభీరముగను, 'తెలుగు' వ్యుత్పత్తికి అనుకూలముగను ఉండుటచేత భాషలో నిలిచి పోయినది. 'తెలుగు'కు వ్యుత్పత్తి చెప్పుటలో విద్యానాథుడు చెప్పిన విషయమునే అతనికి తరువాతికాలపు తెలుగు లక్షణవేత్తలు ఉటంకించినారు. వీరిలో ప్రథముడు పదునైదవ శతాబ్దము పూర్వార్ధమునం దుండిన విన్నకోట పెద్దన. ఇతడు తన కావ్యాలంకార చూడామణిలో
11.   ధర శ్రీపర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఞ వఱలు త్రిలింగా
కర మగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్‌.

'తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ
దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె
వెనుకఁ దెనుఁగుదేశమును నండ్రు కొంద'
12.  రని చెప్పినాడు. దీనినే క్రీస్తుశకము 17వ శతాబ్దములో ఉండిన అప్పకవి అనువదించినాడు. పాల్కురికి సోమనాథుడు ఈదేశమును 'నవలక్ష తెలుంగు', అనగా నవలక్ష గ్రామపరిమితమైన తెలుగుదేశము అని తన పండితారాధ్య చరిత్రలో నుడివియున్నాడు. అప్పటి మహమ్మదీయ చరిత్రకారుడైన ఈసామీకూడ 'నౌలక్‌ తిలింగ్‌' అని చెప్పినాడు. పదునాలుగవ శతాబ్దము పూర్వార్ధమునాటి శాసనములలో ఇది 'తిలింగ' దేశమని, 'తైలింగ ధరణితల' మని వ్యవహరింపబడినది. పైని చెప్పిన శతాబ్దమునాటి ఒక శాసనము తిలింగదేశము నీ విధమున నిరూపించుచున్నది.
13.  "పశ్చా త్పురస్తా దపి యస్య దేశౌ
ఖ్యాతౌ మహారాష్ట్రకలింగ సంజ్ఞౌ;
అవా గుదక్‌ పాండ్యక కాన్యకుబ్జౌ
దేశ స్స్మతత్రాస్తి తిలింగనామా."
14.  ఈరీతిని తెలుగు దేశమున కంతకును ఒకరీతిగా ఎల్లలు తెలుపబడినవి.
15.  తెలుగు ఆంధ్రమునకు పర్యాయపదమైనది. తెలుగునకు వ్యుత్పత్తి కాని, ఆపదము తొలుదొల్త జాతివాచకమో, భాషావాచకమో కాని తెలియదు. జాతివాచకము కాని భాషావాచకము కాని అగుచో ఆదిమకాలములో అంధ్రులు తెలుగువారు ఒక్కరగునో కాదో, ఈ రెండు పదములు ఎట్లు పర్యాయపదములయినవో ఇవి భావి పరిశోధనలవలన తేలవలసిన విషయములు. వీనినిగురించి ఎట్టి చర్చలు చేసినను అవి ఊహాజనితములే కాని నిరూఢ ప్రమాణ నిబద్ధములు కావు. నన్నయ భట్టారకుని నాటినుండి తెలుగు అంధ్రములు ఒకదాని కొకటి పర్యాయ పదములయినవి. నేడు తెలుగువా రన్నను ఆంధ్రు లన్నను, తెలుగుభాష యన్నను ఆంధ్రభాష యన్నను ఒకటే; అంధ్రదేశమే ఆంధ్రదేశము. అదియే తెలుగుదేశము.
16.  మల్లంపల్లి సోమశేఖర శర్మ.
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.
Description: http://www.andhrabharati.com/pics/goldleft.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldright.gif
ప్రాచీన దక్షిణహిందూదేశ చరిత్ర వలెనే ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకూడ ఇంకను నిర్మాణదశలోనే ఉన్నది. చరిత్రరచనకుగల సాధనసామాగ్రి అధికముగనే ఉన్నది; కాని దానిని ఉపయోగించుకొని చారిత్రక విషయములను సమన్వయము చేయుటలోను, తగిన రీతిని మన దేశచరిత్ర రచించుటలోను ఇంకను తగినంత కృషి జరుగలేదు. చరిత్ర నిర్మాణములో కృషిచేయువారు చాల తక్కువ; ప్రత్యేక కృషి చేసి విషయమును గ్రహింపవలసిన చరిత్ర సాధనములు ఎక్కువ. అయినను గడచిన ముప్పది నలువది సంవత్సరములలో జరిగిన కృషి సాధారణమైనది కాదు. ఇందువల్ల మన దేశ చరిత్రను గురించిన విషయము నలువదేండ్ల క్రిందటికంటె మనకు ఇప్పుడు ఎక్కువగా తెలియుచున్నది. ఇంకను మన దేశ చరిత్రమును గురించి ఎక్కువ పని జరుగవలసియున్నది.
మల్లంపల్లి సోమశేఖర శర్మ.
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.

మనదేశచరిత్ర నిర్మాణమునకు గల ఆధారములు అన్నిటిలోనికి ముఖ్యములయినవి, ప్రామాణికములయినవి శాసనములు. మనదేశములో దొరకిన అత్యంత పురాతన శాసనములు మౌర్యవంశజుడయిన అశోక చక్రవర్తివి. ఇవి హైదరాబాదులోని మాస్కిలోను, కర్నూలు జిల్లా లోని యెర్రగుడి, రాజులమందగిరులలోను, కళింగములోని జౌగడ, ధౌలీలలోను కానవచ్చినవి. అశోక చక్రవర్తి క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దమునాటి వాడగుటచేత ఈ శాసనములును ఆనాటివే; రెండువేల సంవత్సరములకు పూర్వపువి. ఈ యశోకచక్రవర్తి శాసనములవల్ల అతని సామ్రాజ్యము దక్షిణదిశకు ఎంతమేర వ్యాపించినదో తెలియుచున్నది. అశోకుని శాసనములు మన తెలుగుదేశములో కాన్పించినను, అవి మొత్తముమీద హిందూదేశ చరిత్రమునకు సంబంధించినవి కాని తెలుగుదేశచరిత్రకు ఉపకరించునవి కావు.
అశోకుని శిలాశాసనములకు తరువాత ఇంచుమించుగా అంతప్రాచీనమైనవి భట్టిప్రోలువద్ద దొరకిన ధాతుకరండముమీది శాసనములు. ఇవి క్రీస్తు పూర్వపు తుది శతాబ్దముల నాటివి. వీనివల్ల ఆనాటికే తెలుగుదేశములో బౌద్ధము పరివ్యాప్తమయినట్లు స్పష్టమగుచున్నది. తెలుగుదేశమునకు సంబంధించిన వైనను శాతవాహన నృపతుల తొలి శాసనములు పడమటి దక్కనులోని కార్లె, నాసిక, కన్హేరీల వద్దనున్న గుహాలయములలో కానవచ్చినవి. అమరావతీ స్తూపమున కానవచ్చిన శిలాశాసనము లన్నియు వేరు వేరు వ్యక్తులు బుద్ధునిమీది భక్తిపెంపున బౌద్ధస్తూపమునకును, బౌద్ధసంఘమునకును చేసిన దానములను తెలుపును. ఆ కాలములో తెలుగుదేశమున వ్యాపించిన బౌద్ధ ధర్మ సంప్రదాయమునకు చెందిన విషయములును, కొంతవరకు ఆనాటి జనుల యాచార వ్యవహారములును పైనుడివిన శాసనములవలన తెలియవచ్చును.
ఇక్ష్వాకునృపతుల కాలపు శాసనములవలె అందమయిన శాసనములు తెలుగుదేశములో అంతకు పూర్వము కాని, తరువాతను గాని కానరావు. ఇక్ష్వాకులకు పిదప తెలుగు దేశమును పల్లవులు, బృహత్ఫలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రులు పరిపాలించిరి. అశోకునికాలము నుండి ఇక్ష్వాకులకాలము చివరివరకు - అనగా క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దమునుండి క్రీస్తుశకము మూడవ శతాబ్దాంతమువరకు - మాత్రమే కాక తరువాత మరికొంత కాలమువరకు కూడ తెలుగుదేశములో కానవచ్చు శాసనభాష ప్రాకృతము. ఆనాటి ప్రజల భాషలకు ప్రాకృతమన్నది సామాన్యనామము. క్రీస్తుశకము నాలుగవ శతాబ్దములో రాజ్యముచేసిన మొదటి పల్లవ, మొదటి శాలంకాయన, మొదటి ఆనందగోత్ర, బృహత్ఫలాయనుల తామ్రశాసనములలో సైతము ప్రాకృతమే కానవచ్చును.
ఇక్ష్వాకుల కాలమునకు తరువాతి నుండి కానవచ్చినవి తామ్రశాసనములు. తామ్రశాసనములు అనగా రాగి రేకుల మీద వ్రాశిన శాసనములు. శాసనములను శిలల మీదను, రాగి రేకుల మీదను మాత్రమే కాక బంగారు రేకుల మీదను, వెండి రేకులమీదను, తుదకు ఇత్తడి, ఇనుప రేకులమీదను, కంచురేకులమీదను వ్రాయువారు. మన దేశములో బంగారు రేకులమీదను, ఇనుపరేకులమీదను వ్రాసినవి దొరకలేదు. దేవాలయములలో స్వామికి అభిషేకము చేయు కంచు ధారాపాత్రలమీదను, కంచువిగ్రహముల పీఠములమీదను చెక్కిన శాసనములు కలవు. విజయనగరాధీశ్వరుడయిన శ్రీరంగరాయల శాసనము ఒక్కటే వెండిరేకులమీద లిఖించినది తెలుగుదేశములో దొరకినది. ప్రాకృతభాషా శిలాశాసనములకు తరువాత తెలుగుదేశములో విరివిగా కానవచ్చినవి తామ్ర శాసనములు.
పౌరాణిక హిందూమతముతోను, వైదిక సంస్కృతి పునరుద్ధరణముతోను తామ్రశాసనములు వాడుకలోనికి వచ్చినవి. వైదికసంస్కృతి పునరుద్ధరణముతో సంస్కృతమునకును, వేదవిదుడయిన బ్రాహ్మణునికిని ప్రాముఖ్యము కలిగినది. తామ్రశాసనభాష సంస్కృతమయినది. సాధారణముగా ప్రతితామ్రశాసనమును బ్రాహ్మణులకు చేసిన భూదాన, అగ్రహారదానములను తెలుపును. ఒకరాజు భూమిని బ్రాహ్మణునికి దాన మిచ్చునపుడు దానపత్రమును ప్రధానముగా రాగిరేకులమీద వ్రాసియియ్యవలెనని, అ ట్లిచ్చునపుడు దాతల, ప్రతిగ్రహీతలతోపాటు వారి తండ్రితాతల నామములను, దాన కారణమును, దానకాలమును అందు వ్రాయవలెనని ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథములు పేర్కొనుచున్నవి. అటుపిదప, దాన మిచ్చిన ప్రదేశమును, దాని సరిహద్దులును, తరువాత దానమును కాపాడినందువలన వచ్చుఫలమును, హరించినందువలనను చెరచినందువలనను వచ్చు పాపమును తెలుపు వ్యాసప్రోక్త శ్లోకములును ఉదాహరింపవలయును. అంతటితో శాసనము పూర్తియగును. తామ్రశాసన మనగా పూర్వ కాలపు దానపత్రము. తామ్రశాసనములు ఆరంభకాలమున దాతవంశమున మూడు తరములవారినే చెప్పుచు వచ్చినను కాలక్రమమున పౌరాణిక వంశానుక్రమముతోపాటు దాతసంపూర్ణ వంశవృక్షమును, ఆయా రాజుల పరాక్రమ కృత్యములనుకూడ వర్ణించుచు వచ్చినవి. కాలము గడచినకొలది శాసనములలో బార్హస్పత్య మానాబ్దములును, శక సంవత్సరములును సూచించుట పరిపాటియైనది. మొదట శకరాజ సంవత్సరములు, శక రాజ్యాభిషేక సంవత్సరములు అను పేరుతో ఆరంభమైన సంవత్సరములు క్రీస్తుశకము పదమూడవ, పదునాలుగవ శతాబ్దములనుండి శాలివాహన శకాబ్దములుగా మారినవి. పూర్వ చాళుక్యనృపతుల కాలమునుండి దత్తగ్రామసీమావధులు తెలుగులో వర్ణితము లగుటవలన తామ్రశాసనములు ద్విభాషాశాసనములైనవి. అంతకు పూర్వము గ్రామనామములు మాత్రమే తెలుగులో ఉండెడివి.
కళింగ-ఆంధ్ర సముద్రతీరములనుండి ప్రాచ్యదేశములకును, సుమత్ర, జావా మొదలైన ద్వీపములకును వలస వెళ్ళిన హిందూ, బౌద్ధ ఆంధ్ర, కాళింగులు తమతోపాటు తమ లిపిని కూడ అక్కడ ప్రవేశపెట్టిరి. ఈ కారణముచేత సుమత్ర, జావా, బోర్నియో, ఇండో చైనాలలో కాన వచ్చు మొదటి శాసనములు సాతవాహనులనాటి బ్రాహ్మీ లిపిలోను, వేంగీ లిపిలోను ఉన్నవి. ఆ శాసనముల భాష సంస్కృతము.
ప్రాకృత భాషలో నున్న శిలాశాసనములకు తరువాత క్రీస్తుశకము నాలుగవ శతాబ్దమునుండి పదునొకండవ శతాబ్దము వరకును శిలాశాసనము లరుదుగను, తామ్రశాసనము లధికముగను కానవచ్చును. క్రీస్తుశకము ఆరవ శతాబ్దమునుండి తెలుగు దేశములోని శిలాశాసనములు తెలుగుభాషలో ఉన్నవి. శిలాశాసనములలో తెలుగు పద్యములు కనిపించుట క్రీస్తుశకము తొమ్మిదవ శతాబ్దము నుండియే. క్రీస్తుశకము పదునొకండవ శతాబ్దమునుండి తామ్ర శాసనములకు తోడు శిలాశాసనములును అధికమైనవి. అప్పటినుండియు శిలాశాసనములు తెలుగులోనేకాక సంస్కృతములో వ్రాయుట కూడ ఆచారమయినది. శాసనములలో సంస్కృతమును, తెనుగును కలిపి వ్రాయుటయు అలవాటు అయినది. సాధారణముగా శిలాశాసనము లన్నియు దేవాలయములకు చేసిన దానధర్మములను తెలుపును. వేరువేరు వృత్తుల వారు, వర్తక సంఘములవారు తమతమ వృత్తులకు, సంఘములకు సంబంధించిన వ్యవహార విషయములను, నియమ నిబంధనలను శిలలమీద చెక్కించుచు వచ్చిరి; కాని ఇట్టివి చాల అరుదు.
కళింగదేశ తామ్రశాసనములలోని లిపి మొదట వేంగీలిపి, అనగా తెలుగు-కన్నడ లిపియే; కాని కళింగ దేశమునకు ఇరుగు పొరుగుల నున్న ఉత్తరదేశములతో సంబంధము ఎక్కువగుటవలన కళింగ తామ్రశాసన లిపి కుటిలలిపిగా మారి క్రమక్రమముగా పదవ శతాబ్దమునాటికి నాగరియై అటుతరువాతకూడ, అదియే వాడుకలో ఉండెను. ఇట్లే కళింగదేశములోని శిలాశాసనములు మొదటినుండి తెలుగు లోనే తెలుగు-కన్నడ లిపిలో ఉండినను క్రీస్తుశకము పదునొకండు, పండ్రెండు శతాబ్దములనుండి సంస్కృతములో నాగరిలిపిలోకూడ కానవచ్చుచున్నవి.
నాగరిలిపి శాసనములు ఒక కళింగములోనే కాక తెలంగాణాలోను కానవచ్చును. కాకతీయుల శిలాశాసనములును, తామ్రశాసనములును కొన్ని పశ్చిమోత్తరలిపుల ప్రభావమున నాగరిలిపిలో ఉన్నవి. కాని కళింగ గాంగ శాసన నాగరిలిపికిని, కాకతీయ శాసన నాగరిలిపికిని ఆశాసనములు కానవచ్చిన ప్రదేశమును బట్టి కొంచెము భేదము ఉన్నది. క్రీస్తుశకము పదునాలుగవ శతాబ్దమునుండి వచ్చిన విజయనగర శాసనము లన్నియు నాగరి లిపిలోనే ఉన్నవి. ఈ నాగరిని నంది నాగరి అందురు.
శాతవాహన, ఇక్ష్వాకు రాజన్యుల చరిత్రమును, బృహత్ఫలాయన, ఆనందగోత్ర, శాలంకాయన, విష్ణుకుండి, పూర్వచాళుక్య, పూర్వగాంగాది రాజవంశములను గురించిన చరిత్రమును కేవలము శాసనములవల్లనే తెలియవచ్చినది. క్రీస్తుశకము పదునొకండవ శతాబ్దమునకు పూర్వపు దేశచరిత్ర తెలియుటకు శాసనములే మనకు పరమాధారము లైనవి.
మల్లంపల్లి సోమశేఖర శర్మ.
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.
Description: http://www.andhrabharati.com/pics/goldleft.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldright.gif
దేశచరిత్ర నిర్మాణములో శాసనముల యంత ఎక్కువగా కాకపోయినను కొంతవరకు ఉపకరించునవి నాణెములు. మనము ఇప్పుడు రూపాయలు మొదలైనవి వాడుక చేయుచున్నట్లే మన పూర్వులుకూడ రకరకము లైన నాణెములను వాడుచుండిరి. వానిలో బంగారపువి, వెండివి, రాగివి మాత్రమేకాక సీసపు నాణెములు, మిశ్రలోహపు నాణెములు కూడ ఉండెను. వీనిలో బంగారపువి, వెండివి చాల తక్కువగా దొరకినవి. మిగిలినవే అధికము. నిర్ణీతమయిన పాళ్ళలో సీసము, రాగి, తుత్తునాగము కలిసిన మిశ్రమమునకే మిశ్రలోహము అని పేరు. ఈ లోహముతో చేసిన నాణెములకు నాణక శాస్త్రజ్ఞులు పోటిన్‌ నాణెములు అని పేరు పెట్టిరి. ఇవి సాతవాహనులకు తరువాత వాడుకలో నుండినట్లు కనిపించదు. సాధారణముగా సువర్ణములు, నిష్కములు, పురాణములు లేక ధరణములు అనునవి చాల పురాతనమైనవి. మనపూర్వపు నాణెములన్నియు మనుధర్మశాస్త్రములో ఇచ్చిన తూకములను అనుసరించి పుట్టినవి. గురివెందగింజ కాని, రతి కాని తూకమునకు ప్రాతిపదిక. ముప్పది రతుల తూకము గల నాణెము సువర్ణము; కాని అట్టి నాణెములు ఇంత వరకు లభింపలేదు. శాతవాహన, ఇక్ష్వాకు రాజుల కాలమునాటి శాసనములవల్ల ఆకాలములో వెండి పురాణములు, కార్షాపణములు వాడుకలో ఉండినట్లు తెలియుచున్నది. కార్షాపణములు వెండివేకాక రాగివి కూడ ఉండెను. శాతవాహన రాజయిన గౌతమీపుత్ర శాతకర్ణికి పూర్వపు సాతవాహనుల నాణెములు అరుదుగా దొరకినవి. పులోమావి కాలమునుండి దొరకిన నాణెము లసంఖ్యములు; వీనిలో పోటిన్‌ నాణెములు, సీసపు నాణెములు ఎక్కువ. సాతవాహనుల నాణెములమీద ఒకవైపున గుర్రము. ఏనుగు, సింహము, ఒంటె మొదలైన జంతువుల యొక్కయు, రెండు తెరచాపకొయ్య లున్నట్టి కాని,లేనట్టి కాని పడవల యొక్కయు బొమ్మలును, వానిపై నాణెముల అంచున ఆ నాణెములను ముద్రకొట్టించిన రాజులపేర్లును ఉండును. రెండవ వైపున ఉజ్జయినీ చిహ్న ముండును.సంకలనపు గుర్తుకొమ్ములకు (+) చివరలను అంటి నాలుగువైపుల నాలుగు సున్న లుండు దానికే ఉజ్జయినీచిహ్న మనిపేరు. నావ చిహ్నముగాగల నాణెములు సాతవాహనుల సముద్రాధి పత్యమునకును, నౌకావర్తక వ్యాపారాధిక్యమునకును నిదర్శనములు. హిందూదేశ మంతటిలోను మొదట సముద్రాధిపత్యము వహించినవారు సాతవాహనులు. సాతవాహనుల కాలములో తెలుగుదేశమునకును, రోము నగరమునకును వర్తకవ్యాపారము బాగుగా సాగుచుండుటచేత రోమకచక్రవర్తుల బంగారు నాణెములు ఇచ్చి వర్తకులు ఇచ్చటి మల్లు సెల్లాలు క్రయము చేసి కొని పోవుచుండిరి. ఈ కారణమున తెలుగుదేశములో ప్రత్తి పైరగు ప్రాంతము లందు రోమకచక్రవర్తుల నాణెములు దొరకినవి. నాగార్జునునికొండ శాసనములలో దీనార మాషకము లనబడు నాణెములుకూడ ఉదాహృతములైనవి. దీనార మన్నది విదేశీయ నాణకము.
అటుతరువాత వాడుకలోనికి వచ్చిన బంగారు నాణెముల మీద వరాహముద్ర ఉండుటచేత వీనికి వరాహములని పేరు కలిగినది. ఇదియే ప్రజల వాడుకలో కాలక్రమమున వరహా యైనది. వీనికే గద్వాణము లనియు పేరు. వరాహము చాళుక్యరాజ లాంఛనము. అందువలన ఈ నాణెములను వాడుకలోనికి తెచ్చినవారు చాళుక్యులని భావింపబడుచిన్నది. పూర్వ చాళుక్యుల రాగి నాణెములును దొరకినవి. వీరికి పూర్వులయిన శాలంకాయన, విష్ణుకుండి వంశజుల నాణెము లింతవరకు దొరకినవి చాలకొద్ది. చాళుక్య చంద్ర బిరుదముగల పూర్వ చాళుక్య ప్రథమ శక్తివర్మ యొక్కయు, రాజరాజనరేంద్రుని యొక్కయు బంగారు నాణెములు బర్మా ఆరకాన్‌ ప్రాంతముల దొరకినవి.
దక్షిణ హిందూదేశపు నాణెములమీద పూర్వపు రాజులు తమపేర్లనో బిరుదములనో ముద్ర కొట్టించువారు. ఇటువంటి నాణెములు ఇంతవరకు చాల దొరకినవి; కాని వానిమీది బిరుదములను బట్టి అవి చలామణిలోనికి తెచ్చిన రాజును, రాజవంశమును గుర్తింప గుదిరినవి చాల తక్కువ.
శాసనములలో ఉదాహృతములైన గండగోపాలమాడలు ఇట్టివే. గండగోపాల బిరుదము తెలుగు చోళులకు ఉండుటవలన ఈ మాడలు వారివే కావచ్చును. మాడలు, వెండి టంకములు, పణములు, బిరుదుమాడలు, పద్మటంకములు మొదలైనవి, వేరు వేరు రకముల నాణెములు శాసనములలో ఉదాహృతమయినవి; కాని అవి ఎట్టివో, ఎవరు ముద్రించినవో ఈ విషయము లేవియు తెలియవు. ఏవేవో నాణెములు దొరకినను, అవి ఫలాని వారివని నిర్ధారణచేయుట కూడ కష్టముగ నున్నది. పద్మటంకములలో కొన్ని నెల్లూరు తెలుగు చోళులవి కలవు.
కాకతీయుల బంగారు, వెండి, రాగి నాణెములు కలవు. రాగి నాణెముమీద ఒకప్రక్క నంది ప్రతిమ కలదు; రెండవప్రక్క నాగరి అక్షరములతో 'కాకతి ప్రతాప రా...య' అని కాకతి ప్రతాపరుద్ర నామము ముద్రితమైనది. కాకతీయుల కాలపు పణములు ఏడు ధాన్యపు గింజల ఎత్తు గలవి. గణిత శాస్త్రములో ప్రతాపమాడ, టంకము పేర్కొనబడినది. ప్రతాప మాడకు చవిలెలు నాలుగు. పండ్రెండు దమ్మము లొక చవిలె. టంకమునకును చవిలెలు నాలుగే. అందువలన మాడయు, టంకమును ఒకటే కావలెను.
విజయనగర రాజుల నాణెములమీది శాసనములు నాగరిలిపిలో ఉన్నవి. కృష్ణదేవరాయల బంగారు నాణెములు పరిమాణములో చిన్నవి. కృష్ణదేవరాయల కాలములో విజయనగర సామ్రాజ్యమున వేరు వేరు విలువలు గల నాణెములు వాడుకలో ఉండినట్లు విదేశ యాత్రికుల యొక్కయు, వ్యాపారుల యొక్కయు వృత్తాంతముల ననుసరించి తెలియుచున్నది.
మల్లంపల్లి సోమశేఖర శర్మ.
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.
Description: http://www.andhrabharati.com/pics/goldleft.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
దేశీయము
శాసనములకు, నాణెములకు తరువాత పేర్కొనదగినది గ్రంథ సామగ్రి. మన చరిత్ర పునర్నిర్మాణమునకు ఉపయుక్తమైన గ్రంథములు చీనా, అరబీ, పార్సీ మున్నగు ఆసియా భాషలలోను, గ్రీకు, ఇటాలియను, పోర్చుగీసు, ఫ్రెంచి, డచ్చి, ఇంగ్లీషు మొదలగు ఐరోపీయ భాషలలోను గలవు. వివరణ సౌకర్యార్థము వీనిని సారస్వతాత్మకము లనియు, చరిత్రాత్మకము లనియు రెండు తరగతులుగా విభజింప వచ్చును.
సారస్వతరచనల ముఖ్యోద్దేశము భాషావిషయక మైనను, చరిత్ర పరిశోధకులకు అవి ఉపయుక్తములగు చున్నవి. మన ప్రాచీన వాఙ్మయ మంతయు రాజాశ్రయమున అభివృద్ధినందినది. రాజులే కాక వారికి అరిగాపులైన సామంతులును, వారిని కొలిచి యుండిన మంత్రి దండనాయకాదులును కవులను, పండితులను తమ యాస్థానములకు రప్పించి వారిని సత్కరించి గ్రాసవాసాదులకు తగు ఏర్పాటులను కావించి గ్రంథరచనకు ప్రోత్సహించి గ్రంథములను అంకితము గొనువారు. గ్రంథకర్తలు, తాము విరచించు గ్రంథములలో తమ్ము పోషించు ప్రభువులను ప్రశంసించుట వాడుకయైనది. ఆ ప్రశంసలలో వారు ఆ ప్రభువుల యొక్కయు, వారి పూర్వుల యొక్కయు ఘనకార్యములను ప్రశంసించువారు. తన్మూలమున ఆ ప్రభువుల పూర్వచరిత్రయే కాక అనుషంగికముగ కొంతవరకు దేశచరిత్రయు తెలియవచ్చుచున్నది. ఉదాహరణము కొరకు రెండు మూడు గ్రంథములను ఇచట పేర్కొనుట యుక్తము.
కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన కవియైన విద్యానాథ మహాకవి 'ప్రతాపరుద్రయశోభూషణము' అను అలంకార గ్రంథమును ఆ రాజునకు అంకితమిచ్చి యున్నాడు. అందు నాటక ప్రకరణమున ప్రతాపరుద్రుని చరిత్రయే ఇతివృత్తముగ గల నాటకము ఒకటి గలదు. దాని మూలమున కొన్ని చరిత్రాంశములు తెలియవచ్చును.
క్రీ. శ. 1378 మొదలు క్రీ. శ. 1404 వరకును విజయనగర సామ్రాజ్యమును పాలించిన రెండవ హరిహర రాయల పుత్రుడును, యౌవరాజ్య పట్టభద్రుడునునైన ఇమ్మడి బుక్కరాయల యొక్క కొలువునందు లక్ష్మణాచార్యుడు అను ఒక భిషగ్వర్యుడు ఉండెను. ఇతడు 'వైద్యరాజ వల్లభము' అను ఒక వైద్యశాస్త్ర గ్రంథమును రచించెను. ఆ గ్రంథ పీఠికలో తనకు ఆశ్రయుడైన ఇమ్మడి బుక్కరాయల ప్రతాపమును తెలుపుటకొరకు అతని దిగ్విజయములను వర్ణించినాడు. అందువలన అన్యత్ర తెలియరాని చరిత్రాంశములు తెలియుచున్నవి.
కృష్ణరాయల నగరి సంగీత విద్వాంసుడైన బండారు లక్ష్మీనారాయణ యను నతడు 'సంగీత సూర్యోదయ' మను శాస్త్ర గ్రంథమును వ్రాసెను. ఆ గ్రంథ పీఠికలో అతడు కృష్ణరాయల కళింగ జైత్రయాత్రనే కాక మరి యే దేశీయ రచనలలోను కానరాని రాయచూరు దండయాత్రను కూడ అభివర్ణించి యున్నాడు.
సంస్కృత గ్రంథములకంటె ఆంధ్ర గ్రంథములు చరిత్రకారునికి అత్యంతోపయుక్తములై ఉన్నవి. మనకు తెలియ వచ్చునంత వరకు ఆంధ్ర కృతులలో కృతిపతి వంశమును వర్ణించు ఆచారము తిక్కన సోమయాజి కాలమున ప్రారంభమైన ట్లున్నది. తిక్కన తన 'నిర్వచనోత్తర రామాయణ' పీఠికయందు కృతిపతియైన మనుమసిద్ధికి పూర్వులైన నెల్లూరుశాఖ తెలుగు చోళరాజుల వంశచరిత్రను కీర్తించియున్నాడు. శ్రీనాథుడు తన కాశీఖండమున రెడ్డిరాజుల ఘనకార్యములను పేర్కొనియున్నాడు. ఇట్లే తక్కిన ప్రబంధ కర్తలు తమ కృతిపతుల వంశ చరిత్రలను వివరించి యున్నారు.
ఇవి కాక చరిత్రకు ఉపయుక్తములగు విషయములను తెల్పు మరియొక తరగతి గ్రంథములు కలవు. ఇవి చారిత్రాత్మక వ్యక్తులకు కాని, వంశములకు కాని సంబంధించినవి కావు. రాజకీయవిశేషములు కాని, పరాక్రమ ప్రశంసలు కాని వానియందు కన్పట్టవు. వానియందు ప్రాయికముగ పట్టణవాసుల జీవనవిశేషములు వర్ణింపబడి యుండును. ఈ తరగతి గ్రంథములలో మొదట పేర్కొన దగినది విజయనగరాధీశ్వరుడైన రెండవ హరిహర రాయల యొక్క కొలువులో ఉండిన వినుకొండ వల్లభరాయలు రచించిన 'క్రీడాభిరామము.' ఇది రావిపాటి త్రిపురాంతక కృతమైన 'ప్రేమాభిరామము' అను సంస్కృత వీథినాటకమునకు తెలుగుసేత. నేటివరకు 'ప్రేమాభిరామము' లభ్యపడలేదు. క్రీడాభిరామములో కాకతీయ ప్రతాపరుద్రుని కాలములో ఓరుగంటిపట్టణము యొక్క వైభవమును, తద్వాస్తవ్యుల స్థితిగతులును వర్ణింపబడియున్నవి. అట్లే, వామన భట్టబాణ కృత 'శృంగారమంజరీ భాణము'ను, డిండిమ కృత 'సోమవల్లీ యోగానంద ప్రహసనము'ను క్రీ. శ. 13, 14 శతాబ్దములనాటి విజయనగరపట్టణ చరిత్ర విశేషములను తెలియజేయును. ఇట్టి గ్రంథముల సంఖ్య యల్పము.
మన సారస్వతములో చరిత్రాధారములుగ ఉపయుక్తములగు మరియొక తరగతి గ్రంథములు కలవు. ఇవి అభ్యుదయ కావ్యములు. ఇందు మహాపురుషుల ఘనకార్యములు వర్ణింపబడును. బిల్హణుని 'విక్రమాంకదేవ చరిత్ర', గంగాదేవి రచించిన 'కంపరాయ చరిత్ర', డిండిముని 'సాళువాభ్యుదయ, అచ్యుతరా యాభ్యుదయము'లు, రామభద్రాంబ రచించిన 'రఘునాథాభ్యుదయము' మున్నగునవి ఈ తరగతిలోని ముఖ్య గ్రంథములు.
అభ్యుదయ కావ్యములు కాక పోయినను, ఆ జాతిలో చేర్పదగినవి మరికొన్ని గ్రంథములు కలవు. కాసె సర్వప్ప అను నతడు 'సిద్ధేశ్వర చరిత్రము' అను నామాంతరము గల 'ప్రతాపచరిత్ర'ను ద్విపద కావ్యముగ రచించెను. కూచిమంచి జగ్గకవికృత 'సోమదేవరాజీయము' అను పద్యకావ్యమును, అజ్ఞానకర్తృకమైన 'ప్రతాపచరిత్ర' అను వచన రచనయు దీని ననుసరించి విరచింపబడినవే. వీనినే కాక కొటికము విశ్వనాథనాయని స్థానాపతి రచించిన 'రాయవాచకము'ను కూడ ఇచట స్మరింపవలసి యున్నది. దీనినే కుమారధూర్జటి 'కృష్ణరాయ విజయము' అనుపేర పద్యకావ్యము చేసెను. ఇందు మొదటి మూడును కాకతీయుల చరిత్రకు సంబంధించినవి. తరువాతి రెండును కృష్ణదేవరాయల విజయములను, రాజ్యపరిపాలనను వర్ణించును. ఇటువంటిదే దిట్టకవి నారాయణకవి విరచిత 'రంగరాయచరిత్ర'. ఇందు క్రీ. శ. 1757లో విజయరామరాజునకును రంగారాయనికిని జరిగిన బొబ్బిలియుద్ధ మభివర్ణిత మైనది.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



వంశ చరిత్రలు - గేయ కథాదులు
తెనుగున కొన్ని వంశావళులు గలవు. వీనిలో ప్రథమమున పేర్కొన దగినది ఆరవీటి వంశశాఖలలో నొక్కటియగు అవుకురాజుల వంశావళి. ఇది యొక స్వతంత్ర గ్రంథము కాదు; దోనేరు కోనేరు నాథకవి రచించిన 'ద్విపద బాల భాగవతము'నకు అనుబంధముగ తత్కృతిపతియైన అవుకు తిమ్మరాజు పూర్వీకుల చరిత్ర ఇందు అభివర్ణింప బడినది. ఆరవీటి వంశచరిత్రను వర్ణించు పద్యకావ్యము ఒకటి కలదు. ఇది అందుగుల వెంకయ్యచేత రచియింప బడిన 'రామరాజీయము'. దీనికే 'నరపతి విజయ' మని నామాంతరము. వంశావళులలో సుప్రసిద్ధమైనది 'వెలుగోటివారి వంశావళి'. ఇది కాలక్రమమున పెరిగినది. కాకతీయ గణపతిదేవుని కాలమునుండియు విజయనగర సామ్రాజ్యాధిపతులలో కడపటి వాడైన ముమ్మడి శ్రీరంగరాయల కాలమువరకు వర్ధిల్లిన రేచర్లగోత్రజు లైన వెలమనాయకుల ప్రతాపాదికములు ఇందు ప్రశంసింపబడి యున్నవి. ఇట్టి వంశావళి గ్రంథములు కన్నడమునను కలవు. 'చిక్కదేవరాయ వంశావళి', 'కెళదినృప విజయము'లు వీనిలో ప్రధానమైనవి. రెంటియందును విజయనగర సామ్రాజ్యమునకు సంబంధించిన చరిత్రాంశము లనేకము వర్ణింపబడి యున్నవి.
వంశావళులవలె ప్రత్యేక చరిత్రాంశములను వర్ణించు గేయ ప్రబంధములును, సీసమాలికలును అనేకములు ప్రచారములో నున్నవి. పల్నాటి వీరచరిత్ర, బొబ్బిలి కథ, కుమారరాముని కథ, గనితిమ్మానాయని సీసమాలిక, కస్తూరి రంగప్పనాయని సీసమాలిక, ఏచమనాయని సీసమాలిక, దేసూరిరెడ్ల సీసమాలిక మున్నగునవి ఇట్టివి.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



స్థానిక చరిత్రలు
ఆంధ్రదేశ చరిత్రాధారములను పేర్కొనునపుడు స్థానిక చరిత్రములును స్మరింపవలసి యున్నది. వీనికి గ్రామ కైఫియతులని పేరు. గ్రామ కైఫియతు లనగా గ్రామ చరిత్రలు. పూర్వకాలములో ప్రతి గ్రామ కరణమును తన గ్రామముయొక్క పుట్టు పూర్వోత్తరములను, ఆస్తి పాస్తులను, పన్ను పర్యాయములను వివరించుచు గుడికట్టు లెక్కలు వ్రాసిపెట్టుట ఆచారమై యుండెను. వానిలో గ్రామములోని భూమిపై ఎవ్వరెవ్వరికి ఎట్టి స్వామ్యపు హక్కులు కల్గినది వ్రాసిపెట్టు వారు. కాలక్రమమున రాజకీయములందు కలుగుచు వచ్చిన మార్పులును, తత్ప్రభావమువలన గ్రామజీవనమున కల్గిన మార్పులును అందు సూచించువారు. కావున ఇతర చరిత్రాధారములలో కానరానివి, జనానీకముయొక్క రాజకీయార్థిక సాంఘిక విషయములకు సంబంధించిన ముఖ్యాంశములు అనేకము ఈ కైఫియతులలో కానవచ్చును. తత్కారణమున ఈ గ్రామ కైఫియతులు చరిత్ర పరిశోధకులకు మిక్కిలి ఉపయోగించుచున్నవి.
క్రీ. శ. 1799, 1800 ప్రాంతమున కల్నల్‌ కాలిన్‌ మెకంజీ యను కుంఫిణీ యుద్యోగి కావలి వెంకటబొర్రయ్య మొదలైన వారిని కొందరిని నియోగించి ఈ గ్రామ చరిత్రలకు నకళ్లు వ్రాయించెను. వీనికి మెకంజీ రికార్డు లని పేరు. సి. పి. బ్రౌన్‌ దొర వీటికి ప్రతులు వ్రాయించెను. వీనిని స్థానిక చరిత్ర లందురు. ఈ చరిత్రలు అరవములోను, కన్నడములోను, తెలుగులోను కూడ ఉన్నవి. తెలుగులో ఉన్నవి అధికము. ఈ చరిత్రలలో రాయలసీమకు చెందినవి అమూల్య మయినవి. వానివల్ల ఇతరములయిన ఏ యాధారములవల్లను తెలియని చారిత్రక విషయము లనేకము తెలియవచ్చును. ఇవి ముఖ్యముగా విజయనగర యుగమునుండి బ్రిటీషు యుగమువరకు గల మనదేశ చరిత్రమును రచించుకొనుటకు అధికముగా ఉపకరించును.
ఇంతవరకు దేశభాషలలోని యాధారములు వివరింప బడినవి; కాని యవి యన్నియు చరిత్ర రచన కుపకరించు సాధనములే కాని చరిత్రలు కావు. మన పూర్వులకు చరిత్ర దృష్టి లేదు; కావున వారు చరిత్రలను వ్రాయుటకు పూనుకొనలేదు. కల్హణుని రాజతరంగిణి ఒక్కటి తక్క సంస్కృతమునందు కాని, ఇతర దేశ భాషలందు కాని చరిత్ర గ్రంథములు లేవు. సంస్కృత భాషలో ఉన్న పురాణములవల్ల కొంత ఇతిహాసము తెలియవచ్చును. కాని, అది యంతయు చారిత్రకాధారములు దొరకని చరిత్ర పూర్వయుగమునకు సంబంధించినవి. ప్రత్యేకముగా చరిత్రకారునికి ఉపయుక్తమయినది పురాణములలోని భవిష్యద్రాజేతిహాసము. దీనివల్లనే మనదేశమును ఆదిమ కాలములో పరిపాలించిన ఆంధ్రరాజులను గురించి తెలియ నగుచున్నది.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



ముస్లిము చరిత్రలు
హిందూదేశమునందు చరిత్ర రచన మహమ్మదీయుల ఆగమనముతో ప్రారంభమయినది. మహమ్మదీయులకు చరిత్రాభిమానము మెండు; కావున వారు మొదటినుండియు చరిత్ర రచనకు పూనుకొని పెక్కు చరిత్ర గ్రంథములను రచించిరి; కాని అవి దేశ చరిత్రలు కావు; అవి యన్నియు మహమ్మదీయ రాజ్యముల యొక్కయు, మహమ్మదీయ రాజవంశముల యొక్కయు చరిత్రములు. కావున వానియందు ఆ రాజ్యములకును రాజవంశములకును సంబంధించిన విషయములు మాత్రమే వర్ణింపబడినవి. వానిలో దేశ ప్రజలనుగూర్చి కాని, హిందూ రాజ్యములను గూర్చికాని ప్రస్తావము ఉండదు. మరియు మతాభిమానము పెంపున మహమ్మదీయ చరిత్రకారులు హిందువులనుగూర్చి కాని, హిందూ రాజ్యములనుగూర్చి కాని విధిలేక చెప్పవలసివచ్చినపుడు ఉన్నది ఉన్నట్లు చెప్పక, సత్యమును కప్పిపుచ్చి, తమ యాధిక్యమును స్థాపించుకొనుటకు విషయమును తారుమారు చేసి చెప్పుదురు; కావున ఆధునిక దృష్టితో దేశ చరిత్రము రచియించునప్పుడు వానియందలి విషయములను చక్కగ పరిశీలించి కైకొనుట యుక్తము. క్రీ. శ. 14 శతాబ్ద ప్రారంభమునుండియు దక్షిణ భారతమున మహమ్మదీయుల ప్రాబల్యము అధికము కాజొచ్చినది. అప్పటినుండియే మహమ్మదీయ చరిత్రలలో దక్షిణ హిందూ రాజ్యముల ప్రస్తావము కానవచ్చును. ఈ చరిత్రలలో సమకాలిక రచనములును, అర్వాచీన రచనములును కలవు.
మహమ్మదీయ చరిత్రకారులలో ప్రప్రథమమున పేర్కొనదగినవాడు అమీరు ఖుస్రూ. ఇతడు బహు మేధావి; మహాకవి, సంగీత విద్వాంసుడు. ఇతడు అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ కాలమునుండి ఘియ్యాజుద్దీన్‌ తుఘ్లకు కాలము పర్యంతము ఢిల్లీ సుల్తానుల యాశ్రయమున వర్ధిల్లి పారశీక భాషలో పెక్కు కావ్యములను రచించుటయే కాక 'తారీఖ్‌-ఇ-ఆలై' అను నామాంతరము గల 'ఖజైన్‌-ఉల్‌-ఫుతూహ్‌', 'తుఘ్లక్‌ నామా' యను చరిత్రలను వ్రాసెను. ఇందు మొదటిది వచన రచన. అందే అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ యొక్క యాంధ్రదేశ దండయాత్రలును, తక్కిన దక్షిణ దిగ్విజయములును వర్ణింపబడినవి. ఈ చరిత్ర గ్రంథమునందే కాక అతనిచే విరచితమైన 'ఖిజ్ర్‌ఖాన్‌ వ దవల్‌ రాణీ', 'నూ సిపిహ్ర్‌' అను కావ్యములలోను ఖిల్జీ సుల్తానుల దక్షిణ దిగ్విజయములు అందందు సందర్భానుసారముగ వర్ణింపబడినవి.
ఇతని తరువాత చెప్పదగినవాడు ఈసామీ. ఇతడు బాల్యమున ముహమ్మద్‌ బిన్‌ తుఘ్లకు ఢిల్లీ నుండి రాజధానిని దౌలతాబాదుకు మార్చినపుడు దక్కనుకు వచ్చి యచ్చటనే స్థిరముగ నిలిచిపోయెను. ముహమ్మదు బిన్‌ తుఘ్లకుపై దక్షిణదేశములవారు తిరుగుబాటు కావించి స్వతంత్ర రాజ్యములు స్థాపించుకొనినపుడు ఇతడు దక్కనునందే యుండి, అచట అపుడు నడచిన చరిత్రాంశములను ప్రత్యక్షముగ చూచెను. క్రీ. శ. 1347 లో స్వతంత్రుడై గుల్బరగ రాజధానిగ బహమనీరాజ్యమును స్థాపించిన అల్లా ఉద్దీన్‌ హసన్‌ గంగూ బహ్మన్‌షాను ఆశ్రయించి అతని యాదర గౌరవములకు పాత్రుడై క్రీ. శ. 1349 వ సంవత్సరమున, 'ఫుతూహ్‌-ఉస్‌-సలాతీ' నను ఉత్తమోత్తమ పద్యచరిత్ర గ్రంథమును రచించి అతనికి అంకితమొసగెను. ఇతని చరిత్రలో ఒక యాంధ్రదేశమునందే కాక దక్షిణ భారతమున నడచిన చరిత్రాంశములు విపులముగ వర్ణితము లైనవి. ఇతడు మహమ్మదీయ చరిత్రకారు లందరిలో గరిష్ఠుడు. ఇతడు గాఢ మతాభిమానము గలవాడైనను సత్యముమీదనే దృష్టి అధికముగ కలవాడు. కావున ఇతడు రచించిన చరిత్ర అత్యంతము విశ్వాసపాత్రమైనది.
ఈసామీకి సమకాలికుడు జియా ఉద్దీ\న్‌ బరనీ అను మహమ్మదీయ చరిత్రకారుడు మరియొక డుండెను. ఇతడు మహమ్మదు బి\న్‌ తుఘ్లకు ఆస్థానమున ఉండెను. మొట్ట మొదటినుండి ముహమ్మదు బి\న్‌ తుఘ్లకు పర్యంతము ఢిల్లీని పాలించిన మహమ్మదీయరాజుల చరిత్రను ఇతడు 'తారీఖ్‌-ఇ-ఫిరోజ్‌షాహి' అను గ్రంథమున వివరించెను. బరనీకి మతాభిమానముతోపాటు జాత్యభిమానముగూడ గాఢమైనందువలన ఇతడు రచించిన చరిత్ర ఈసామీ గ్రంథమువలె పక్షపాతరహితమైనది కాదు. హిందువుల యెడలను, మహమ్మదీయమతము నవలంబించిన భారతీయుల యెడలను ఇతడు ద్వేషముకలవాడై సందర్భము చిక్కినపుడెల్ల వారిని దూరుచుండును. కావున ఇతని యభిప్రాయములను పరిశీలించి చూచి కైకొనుట యుక్తము.
బరనీ వలెనే 'తారీఖ్‌-ఇ-ఫిరోజ్‌షాహి' అను పేరుగల చరిత్రను వ్రాసిన చరిత్రకారుడు మరియొకడు కలడు. ఇతని పేరు షమ్స్‌-ఇ-సిరాజ్‌ ఆఫీఫ్‌. ఇతని చరిత్ర బరనీ గ్రంథమంత ఉపయుక్తమైనది కాదు; కాని ఇందు మరియెచ్చటను కానరాని చరిత్రాంశములు కొన్ని కలవు.
ఇతనితరువాత పేర్కొన దగినవాడు నిజామ్‌ ఉద్దీన్‌ అహమద్‌ బఖ్షి. ఇతడు ఢిల్లీయందు అక్బరుపాదుషా యాస్థానమునం దుండెను. ఇతడు చరిత్ర రచనయం దొక క్రొత్త దారిని తొక్కెను. పూర్వులగు భారతీయ మహమ్మదీయ చరిత్రకారులవలె ఢిల్లీ సుల్తానుల చరిత్రతో తృప్తి నొందక బంగాళ, మాళవ, గుజరాతు, దక్కను ప్రాంతములలో స్వతంత్రరాజ్యములను స్థాపించి పరిపాలించిన మహమ్మదీయ రాజవృత్తాంతములను కూడ వర్ణించి యున్నాడు. నేటివరకు లభ్యమైన బహ్మనీ మొదలగు దక్కను మహమ్మదీయ రాజవంశ చరిత్రలలో నెల్ల నిజాముద్దీ\న్‌ అహమదుచే విరచితమైన 'తబకాత్‌-ఇ-అక్బరీ' లోని గ్రంథభాగమే ప్రాచీనతమ మైనది. అర్వాచీన మహమ్మదీయ చరిత్రకారులలో పెక్కండ్రు నిజామ్‌ ఉద్దీ\న్‌ అహమదు మార్గమును అవలంబించి విపులమైన చరిత్రలను రచించిరి. కాని మహమ్మదీయ చరిత్రలలో నిజామ్‌ ఉద్దీ\న్‌ రచనకు కొంత ప్రత్యేకత కలదు.
నిజామ్‌ ఉద్దీ\న్‌ యొక్క పద్ధతి ననుసరించి చరిత్రను వ్రాసిన రచయితలలోనెల్ల ముహమ్మదు కాసిం హిందూషా ఫెరిస్తా సుప్రసిద్ధుడు. ఇతడు హిందూదేశమునందు మహమ్మదీయుల అభ్యుదయమును వర్ణించుచు ఒకగొప్ప చరిత్ర గ్రంథమును వ్రాసెను. ఇది 'తారీఖ్‌-ఇ-ఫెరిస్తా' అనుపేర వాసికెక్కినది. ఫెరిస్తా దక్కను వాస్తవ్యుడు; మొదట నిజాంశాహి సంస్థానమును ఆశ్రయించి కొంత కాలము అతడు అహమదునగరమున నివసించి యుండెను. తరువాత అతడు విజాపురమునకు వచ్చి అచట ఆదిల్‌ శాహి ప్రభువులను ఆశ్రయించి వారి యనుగ్రహమునకు పాత్రుడై చరిత్ర రచన సాగించెను. భరతఖండమునందు ప్రభుత్వము సల్పిన మహమ్మదీయ రాజవంశము లన్నింటి వృత్తాంతమును ఫెరిస్తా తాను రచించిన చరిత్రమున వర్ణించి యున్నను దక్కను రాజవంశములను, అందును ముఖ్యముగ బహ్మనీ, ఆదిల్‌శాహీ, నిజామ్‌శాహీలను గూర్చి విస్తరించి చెప్పుట వలన అది దక్కను మహమ్మదీయ రాజ్యముల చరిత్రగనే ప్రసిద్ధిచెందినది; కాని ఫెరిస్తాకు స్వమతాభిమానముతో కూడ తనకు ఆశ్రయ మొసగిన ఆదిల్‌శాహీలపై ఆదర మధికమగుటవలన అతడు తరచుగా చరిత్రాంశములను విడిచిపెట్టియు, తారుమారు చేసియు సత్యమును కప్పిపుచ్చి యున్నాడు; కావున అతని చరిత్ర విశ్వాసపాత్రమైనది కాదు. అతని వ్రాతల లోని విషయములు ఇతర చరిత్రాధారములవల్ల రుజువైన కాని అంగీకార్యములు కావు.
ఫెరిస్తా అనంతరము వెలసిన మహమ్మదీయ చరిత్ర కారులలోనెల్ల ఖాఫీఖాను ముఖ్యుడు. ఖాఫీ యనునది అతని వాస్తవ నామము కాదు. అతడు మొగలాయి చక్రవర్తియగు ఔరంగజేబు కొలువులోని యుద్యోగి. ఆ చక్రవర్తి తన చరిత్ర ఎవ్వరును వ్రాయగూడదని శాసింపగా ఇతడు తాను రచించిన చరిత్రను గుప్తముగ దాచియుంచెను. తత్కారణముగ ఇతనికి (ఖాఫీ) దాచి పెట్టిన ఖానుడని పేరు కల్గెనని చెప్పుదురు. ఇతడు తనకు ముందు నడచిన చరిత్రను పూర్వచరిత్రలను ఆధారపరచుకొని వ్రాసెను. దక్కను విషయమున ఇతడు ఫెరిస్తా చరిత్రను అనుసరించినను అందందు ఫెరిస్తా వ్రాతకు విరుద్ధములైన అన్యగ్రంథములలోని చరిత్రాంశములను ఉదాహరించి యున్నాడు. తన కాలమున జరిగిన చరిత్రను మతాభిమాన దృష్టితో కాక యథాతథముగ వర్ణించి సత్యమును తెలిపి యున్నాడు. కావున ఇతని రచన అత్యంతము విశ్వాసపాత్రమని ఆధునిక చరిత్ర పరిశోధకుల యభిప్రాయము.
పైన చెప్పిన వారివలె హిందూస్థాన చరిత్రలను వ్రాయక మరికొందరు మహమ్మదీయ చరిత్రకారులు ప్రాంతీయ మహమ్మదీయ రాజ్యములనుగూర్చి గ్రంథములను వ్రాసిరి. వారిలో ముఖ్యుడు సయ్యద్‌ ఆలీ తబాతబా అను నతడు. ఇతడు నిజామ్‌శాహి సంస్థానమును ఆశ్రయించుకొని రెండవ బుర్హా\న్‌ నిజామ్‌శాహి కాలములో అహమదు నగరమునందు నివసించుచు బహ్మనీ సుల్తానులను గూర్చియు, నిజాంశాహి వంశజులను గూర్చియు 'బుర్హా\న్‌-ఇ-మ అసీ'రను చరిత్ర గ్రంథమును వ్రాసి ప్రకటించెను. సయ్యద్‌ ఆలీ తబాతబా ఫెరిస్తాకు సమకాలీనుడు. హిందువులపై ద్వేషమునందు ఇతడు ఫెరిస్తాకు పైమెట్టు; కాని ఫెరిస్తా గ్రంథము కంటె ఇతనిదే విశ్వాసపాత్రమని చరిత్ర పరిశోధకుల యభిప్రాయము.
ఇట్లే ఆదిల్‌శాహి, కుతుబ్‌శాహి వంశ చరిత్రలను వర్ణించిన రచయితలును కలరు. ఇబ్రాహీం ౙబీరీ యను నతడు 'బుసాతీన్‌-ఉస్‌-సలాతీన్‌' అను గ్రంథమునను ౙహూర్‌ ౙహూరీ యను నతడు 'ముహమ్మద్‌ నామా' యందును విజాపుర సుల్తానుల చరిత్రమును వర్ణించి యున్నారు. అజ్ఞాతనామధేయుడగు చరిత్రకారు డొకడు 'తారీఖ్‌-ఇ-ముహమ్మద్‌ కుల్లీ కుతుబ్‌శాహి' అను గ్రంథమున కుతుబ్‌శాహీల చరిత్రమును వర్ణించి యున్నాడు. మరియొకడు 'హదీకత్‌-ఉల్‌-ఆలమ్‌' అను గ్రంథమున ఈ వంశజుల చరిత్రమును కడపటి కుతుబ్‌శాహి సుల్తానగు తానాశాహ పతనమువరకును వివరించి యున్నాడు. ఈ మహమ్మదీయ చరిత్రలయం దాయా రాజ్యములను ఏలిన సుల్తానుల చరిత్రలే కాక ఇరుగు పొరుగుల తెలుగు రాజ్యములకు సంబంధించిన విషయములును ప్రస్తావవశమున వర్ణింపబడి యుండుట వలన ఇవి తెలుగుదేశ ప్రాచీన చరిత్ర రచనకు మిక్కిలి ఉపయుక్తము లగు చున్నవి.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



విదేశీయము
చిరకాలమునుండియు భారతదేశమునకు ఖండాంతర పూర్వ పాశ్చాత్యదేశములతో సంబంధము కలదు. మత ప్రచారమునకై కొందరును, పుణ్యతీర్థ దర్శనార్థము కొందరును, వ్యాపారార్థము కొందరును, దేశాటనాపేక్షచే కొందరును దేశాంతరములనుండి వచ్చువారు. అట్లు వచ్చిన వారిలో పెక్కండ్రు తాము భరతఖండమునందు అనేక స్థలములలో కన్న విన్న విషయములను తమ పర్యాటన గ్రంథములలో వ్రాసియుంచిరి.
బౌద్ధమతము భరత ఖండమునందు ప్రబలియుండిన కాలమున చీనా మొదలయిన తూర్పు దేశములనుండి యాత్రికు లనేకులు పుణ్యక్షేత్రములను సందర్శించుటకును, బౌద్ధమత గ్రంథములను సంగ్రహించుకొని పోవుటకును వచ్చెడివారు. వారిలో ఫాహియాను, యువా\న్‌ చ్వాంగు లను వారు ముఖ్యులు. ఫాహియాను దక్షిణదేశమునకు రాలేదు; కాని అతడు దక్షిణ హిందూస్థానమును గూర్చి, ముఖ్యముగ పారావత విహారమును గూర్చి, తాను విన్న విషయములను తన పర్యటన గ్రంథమున వివరించి యున్నాడు. ఫాహియానువలెగాక యువా\న్‌ చ్వాంగు దక్షిణ భారతమునకు వచ్చి పలుతావులను సంచరించి తాను చూచిన, విన్న విషయములను గ్రంథస్థము చేసి యున్నాడు. ఇతడు తీరాంధ్రమున పెక్కు దేశములు తిరిగి అచటి మతాచారాదికములను, ప్రజల స్థితిగతులను చక్కగ విచారించి తన యనుభవములను, అభిప్రాయములను ఉల్లేఖించి యున్నాడు. క్రీ. శ. 7 శతాబ్ద పూర్వార్ధమునాటి ఆంధ్రదేశ పరిస్థితులను తెలిసికొనుటకు ఇతని పర్యటన చరిత్రము మిక్కిలి ఉపయోగకరమైనది.
యువా\న్‌ చ్వాంగు వెనుక ఆంధ్రదేశమునకు వచ్చిన ప్రయాణికులలో మార్కొపోలో అను ఇటలీ దేశీయుడు ప్రసిద్ధుడు. ఇతడు వచ్చినపుడు కాకతీయ రుద్రాంబ ఆంధ్రదేశమును పాలించుచుండెను. అప్పటి దేశస్థితిని గూర్చి ఇతడు వ్రాసిన వృత్తాంతము చరిత్రకారులకు అత్యంతోపయుక్తమై యున్నది.
ఇతనికంటె ప్రఖ్యాతుడు ఇబన్‌ బత్తూతా అను అరబీ ప్రయాణికుడు; ఇతని జన్మస్థానము ఆఫ్రికాఖండమున మధ్యధరా సముద్ర తీరమున నుండు మొరాకోదేశము. మహమ్మదీయ ప్రపంచము నంతను త్రొక్కి చూడవలెనను ఉద్దేశముతో స్వదేశమునుండి బయలుదేరి పశ్చిమ మధ్యమ ఆసియా దేశములలో సంచరించి, క్రీ. శ. 1333 లో ఇతడు హిందూస్థానమునకు విచ్చేసెను. అప్పుడు ఆసేతు శీతాచల పరివ్యాప్త భరతఖండము సమస్తమును తుఘ్లకు వంశజుడైన ముహమ్మదు బి\న్‌ తుఘ్లకు ఏకచ్ఛత్రాధిపతియై పరిపాలించు చుండెను. అతడు ఇబ\న్‌ బత్తూతాను చేరదీసి సత్కరించి ఢిల్లీ మహానగరమునకు న్యాయాధిపతిగ నియమించెను. బత్తూతా హిందూదేశమున పదియేండ్లకాలము ఉద్యోగము చేసిన పిమ్మట సుల్తాను ఆదేశము చొప్పున చీనాకు రాయబారము పోవుచు దక్షిణ హిందూస్థానమున పెక్కు స్థలములను దర్శించి, అందలి రాజకీయార్థిక మత సాంఘికాది విషయములను విచారించి తాను రచించిన 'రిస్లా' యను అరబీ పర్యటన చరిత్రమునందు వివరించి యున్నాడు. ఇతని 'రిస్లా' చరిత్ర పరిశోధకుల పాలిటి పెన్నిధానము. అప్పటి భరతఖండ స్థితిగతులు ఇందు చక్కగ ప్రతిబింబించు చున్నవి.
ఇబన్‌ బత్తూతా తరువాత పెక్కండ్రు పాశ్చాత్యులు రాజకీయ కార్యములమీదను, వర్తకము కొరకును దక్షిణ భారతమునకు వచ్చి విజయనగర సామ్రాజ్యమున సంచరించి తమ యనుభవములను వర్ణించుచు గ్రంథములను రచించిరి. వీరిలో మొదట పేర్కొనదగినవాడు అబ్దుల్‌ రజాక్‌ అను పారశీకుడు; ఇతడు షా రూఖ్‌ అను పారశీక రాజు పక్షమున విజయనగర చక్రవర్తియైన రెండవ దేవరాయల యాస్థానమునకు క్రీ. శ. 1444 లో రాయబారము వచ్చి, కొన్ని నెలలకాలము విజయనగరమున నివసించెను. ఇతడు విజయనగర రాజధానిని, అందలి ప్రజల జీవనమును, దేవరాయల యాస్థానపు మర్యాదలను, పండుగ పబ్బములను, వేడుకలు వింతలను విపులముగ వర్ణించుచు 'మత్ల ఉస్‌ స ఆదీ\న్‌' అను పుస్తకమును వ్రాసెను.
ఇతని తరువాత నికోలో కాంటి, వర్థేమా అను పాశ్చాత్య ప్రయాణికులు ఒకరి వెనుక నొకరు విజయనగర సామ్రాజ్యమున పర్యటనము చేసి అనేక విషయములను వర్ణించి యున్నారు.
క్రీ. శ. 15 వ శతాబ్దపు కడపటి దశకమున పోర్చుగీసు వారు దక్షిణహిందూస్తాన పశ్చిమ సముద్రతీర ప్రాంతమునకు వచ్చిరి. అప్పటి నుండియు దక్షిణ హిందూస్తానమునకును, ఐరోపీయ పాశ్చాత్యదేశములకును రాకపోకలు క్రమముగ హెచ్చి, చిట్టచివర ఆంగ్లేయ సామ్రాజ్యస్థాపనకు దారితీసినవి. పోర్చుగీసువారు వచ్చినప్పటినుండియు వారికి విజయనగర రాయలతో స్నేహము కుదిరినది. తత్కారణమున పోర్చుగీసు రాజకీయోద్యోగులు, మత ప్రచారకులు, వర్తకులు మున్నగువారు తరచుగ విజయనగరమునకు వచ్చువారు. వా రందరును విజయనగర రాజకీయములను గూర్చియు, దక్కను మహమ్మదీయ ప్రభువులకును రాయలకును గల పరస్పర రాజకీయ సంబంధములను గూర్చియు, సామ్రాజ్య ప్రజల స్థితిగతులను గూర్చియు తమచే విరచింప బడిన గ్రంథములలోను, నివేదికలలోను ఉత్తర, ప్రత్యుత్తరములలోను వ్రాసి యున్నారు. ఇట్లు విజయనగర సామ్రాజ్యమునకు వచ్చి అచట తమకు కలిగిన గౌరవాదులను తెలుపుచు వ్రాసినవారు పోర్చుగీసువా రొక్కరే కారు; వారి మార్గమును అనుసరించి వచ్చిన డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లీషువారును, ఐరోపీయు లితరులును తమ రచనలలోను, ఫాక్టరీ లెక్కలలోను దేశములోని రాజకీయ విశేషములను, అపుడు సంభవించిన చరిత్రాంశములను వర్ణించి యున్నారు. ఈసందర్భమున పేర్కొనదగినవారిలో ప్రముఖులు దురాతే బర్బోసా, న్యూనిజ్‌, పేయసు లను పోర్చుగీసు యాత్రికులు. బర్బోసా వీరనరసింహ రాయల కాలముననో కృష్ణరాయల రాజ్యారంభ దశయందో రాయసామ్రాజ్యమున సంచారము చేసినట్లు ఉన్నది. న్యూనిజ్‌, పేయసులు కృష్ణదేవరాయల కాలమున వచ్చిరి. బర్బోసా రాయరాజ్యప్రజల జీవన విధానమును తెలియజేయు విషయము లనేకము వివరించి యున్నాడు. పేయసు విజయనగర పట్టణమును, రాయల నగళ్లను, దేవాలయములను, అందలి జన విస్తారమును, వర్తక బాహుళ్యమును వర్ణించి యున్నాడు. న్యూనిజు ఆనెగొంది కంపిలిరాయల కాలమునుండి అచ్యుతరాయల పరిపాలనము వరకును విజయనగర చరిత్రను వ్రాసియున్నాడు. న్యూనిజ్‌ రచనయే విజయనగర చరిత్రలలో మొదటిది. తాను విన్న పూర్వరాజ వృత్తాంతమును, కనులార కాంచిన కృష్ణ, అచ్యుత దేవరాయల చెయిదములను ఆధారపరచుకొని న్యూనిజ్‌ గ్రంథ రచనను సాగించెను. న్యూనిజ్‌ రచన నేటికిని విజయనగర చరిత్ర రచనకు కల మూలాధారములలో ప్రథమస్థానమును ఆక్రమించుచున్నది.
వీరి సంగతిని చేర్పదగినవాడు మాన్యుయల్‌ బర్రాడాసు. ఇతడు క్రీ. శ. 1616 ప్రాంతమున దక్షిణ హిందూదేశమునకు వచ్చియుండి, అప్పుడు విజయనగర సామ్రాజ్యమున నడచిన విశేష చరిత్రాంశములను కొన్నింటిని అభివర్ణించి యున్నాడు. క్రీ. శ. 1614 లో వీరవెంకటపతి రాయలు కాలగతిని చెందిన పిమ్మట గొబ్బూరి జగ్గరాజకృత దుష్కృత్యములను, వెలుగోటి యేచమనాయని యద్వితీయ ప్రతాపమును, తత్ఫలితముగ చొప్పడిన జగ్గరాజాది రాజద్రోహుల నిర్మూలనమును, రాయరాజ్య పునఃప్రతిష్ఠను చక్కగ వివరించి యున్నాడు. అప్పటి రాజకీయ చరిత్ర పునర్నిర్మాణమున కనుకూలమగు సాధనములలో బర్రాడాసు లేఖ ప్రధానమైనది.
ఈపై నుడివినవారు కాక క్రీస్తుశకము పదునేడవ శతాబ్దములో హిందూదేశమునకు వచ్చిన టవెర్నియరు, బెర్నియరు విజయనగరాధీశ్వరుడయిన రెండవ వేంకటపతి దేవరాయల కాలమున దక్షిణ హిందూదేశమునకు వచ్చిన జెసూయిట్‌ ఫాదరులు రూబినో మొదలైనవారును వ్రాసిన యాత్రా వృత్తాంతములు ఇంకను చాల ఉన్నవి. ఇవి కాక, డచ్చివారి 'డాగ్‌ రిజిస్టరు', తూర్పు ఇండియా కంపెనీవారి రికార్డులు అనేకము మన దేశచరిత్ర రచన కుపయోగించునవి కలవు. వీని అన్నిటి యాధారమున మన దేశ చరిత్ర రచింపబడుచున్నది.
డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య, ఎం.ఏ., పి.హెచ్‌.డి.,
రీసెర్చ్‌ ఆఫీసర్‌, హిస్టరీ ఆఫ్‌ ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌ ఇన్‌ ఆంధ్ర ప్రదేశ్‌.
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము )
Description: http://www.andhrabharati.com/pics/goldleft.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldright.gif
పురాతనస్థల ఖనన పరిశోధన

Description: http://www.andhrabharati.com/pics/goldright.gif



ఉపోద్ఘాతము
శాసనశాస్త్రములును, నాణకశాస్త్రములును పురాతత్త్వ శాస్త్రములోని విభాగములు. ఇవి మాత్రమే కాక ఆ శాస్త్రమునకు సంబంధించిన మరియొక ముఖ్య విషయము పురాతనస్థల ఖనన పరిశోధన. మత విషయకముగా కాని, చారిత్రకముగా గాని ఒకప్పుడు ప్రసిద్ధి వహించి ఇప్పుడు దిబ్బలయి పోయిన ప్రాచీన క్షేత్రములను, నగరములను త్రవ్వి పరిశోధించి, అట్టి పరిశోధనలో బయలు పడిన పురాతన నిర్మాణ శిథిలములను బట్టియు, వస్తు సామగ్రిని బట్టియు వాని కాలమును నిర్ణయించి, ఆ కాలమునాటి జనుల ఆచార వ్యవహారాదికములను, జీవన విధానమును - ఆనాటి నాగరికతను తెలిసికొనుటకును, ఆ నాటి చరిత్రను పునర్నిర్మించుటకును పురాతత్వ శాస్త్రజ్ఞులు ప్రయత్నించు చున్నారు. ఈ విధముగ చేసిన పురాతనస్థల ఖనన పరిశోధనను అనుసరించియే మన నాగరికత, సంస్థలు, కళలు మొదలైనవాని ప్రారంభమును, వాని ప్రాథమిక దశను తెలిసికొనుటకు వీలగుచున్నది.
తెలుగు దేశమునకు క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దమునుండియే ప్రారంభమయి క్రీ. శ. పదునేడవ శతాబ్దము వరకు సాగిన సుదీర్ఘమగు స్వతంత్ర చరిత్రము కలదు. ఈ రెండువేల సంవత్సరములలో తెలుగు దేశమున వేరువేరు ప్రాంతములందు రాజ్యములు నిర్మించుకొని పరిపాలనము చేసిన రాజవంశము లనేకము కలవు. తెలుగు దేశమును సంపూర్ణముగ కాకపోయినను, విశేష భాగమును ఒకటే పతాకక్రిందికి తీసికొనివచ్చి పరిపాలనము చేసిన మహారాజాధిరాజులును, చక్రవర్తులును కలరు. తెలుగు దేశమును పరిపాలించిన రాజవంశములు వైదిక ధర్మావలంబకులును, యజ్ఞయాగాది కర్మనిరతులును అయినను పరమత సహిష్ణులై బౌద్ధ, జైనములను కూడ ఆదరించిరి. ఈ రెండువేల సంవత్సరముల కాలములో పూర్వము ప్రసిద్ధి వహించిన పట్టణములు చాల పాడుపడినవి; కొన్ని పల్లె లయినవి. బౌద్ధ జైనములు మన దేశమున నశించిన వెనుక అనాదృతిపాలై బౌద్ధ సంఘారామములును, జైనవసదులును భూగర్భగతము లైనవి. చరిత్ర ప్రసిద్ధి వహించిన పురాతన స్థలముల యొద్ద పెద్ద దిబ్బ లిప్పటికిని కానవచ్చును. ఇటువంటి దిబ్బలలో కొన్నిటిని పురాతత్వశాఖవారు త్రవ్వించి పరిశోధనలు జరిపినారు; ఇంకను జరుపుచున్నారు. ఇటువంటి దిబ్బలను త్రవ్వించి పరిశోధించుటవలనను, దేశములో కానవచ్చు శాసనములను పరిశోధించుటవలననే మన దేశము యొక్క పూర్వ చరిత్ర క్రమముగా బయటపడుచున్నది.
తెలుగు దేశములో పురాతత్వశాఖవారు కొన్ని కొన్ని దిబ్బలను, స్థలములను త్రవ్వించి జరిపిన పరిశోధనలవలన బౌద్ధావశేషములకు, జైనావశేషములకు నెలవైన చరిత్ర ప్రసిద్ధములగు ప్రదేశము లనేకము బయలుపడి మన దేశములోని బౌద్ధ, జైన మతచరిత్రములు పూర్వముకంటె ఎక్కువగా తెలిసికొనుటకు వీలయినది. ఈ ప్రదేశములలో అమరావతి, నాగార్జునుని కొండ, భట్టిప్రోలు, గంటసాల, జగ్గయ్య పేట, గుమ్మడిదుర్రు, సంకారము, రామతీర్థము, శాలిహుండము ముఖ్య బౌద్ధస్థలములు. తెనుగుదేశమున బౌద్ధము జనాదరణము చూరకొని క్రీ. పూ. 3వ శతాబ్దము మొదలు క్రీ. శ 7వ శతాబ్దము వరకు వాస్తు, శిల్ప, చిత్రలేఖనములకు తీర్పులు దిద్దినది. బౌద్ధసంఘములు వేరువేరు కులములకు తెగలకు ఉన్నతాదర్శమును చూపి నైతికముగా జనుల నిత్యజీవితములందు మార్పులు తెచ్చినవి. భౌతికములైన సీమావధులను దాటి మతమును వ్యాపింపజేయుటకయి ఆ కాలమునందలి బౌద్ధభిక్షువులు అపారమయిన కృషిని కావించిరి. వారు ఆనాడు అట్లు కావించిన కృషి ఆంధ్రనాగరికతకు అభ్యున్నతిని, శోభను సమకూర్చినది.
బౌద్ధుల పవిత్రవాస్తు నిర్మాణమును గూర్చిన పరిశోధన భారతీయ పురాతత్వ శాస్త్రమందు ప్రధానమైన స్థానమును ఆక్రమించినది. బౌద్ధులకు పవిత్రములైన కట్టడములలో సంఘారామము, స్తూపము అనునవి ప్రముఖములు. విహారమను శబ్దము బౌద్ధభిక్షువులు నివసించు మఠములకే కాక, బౌద్ధాలయములకు కూడ వాడబడుచుండినట్లు యువా\న్‌ చ్వాంగ్‌ వ్రాతలవలనను, సింహళద్వీపమున ప్రార్థన మండపములకు నేటికిని ఈనామము చెల్లుచుండుట వలనను తెలియుచున్నది.
బౌద్ధ సంఘారామము సాధారణముగా చతురస్రమయి, అంతర్భాగమున మండువావిధమున ఖాళీస్థలమును, దీని నావరించుకొని చతుశ్శాలయు, అందు మూడు ప్రక్కల 'భిక్ఖు'ల నివాసములకై కట్టిన గదులును గల నిర్మాణము. స్తూపమను పదము బౌద్ధ వాస్తువున ఇటుకతో కాని, రాతితోకాని, మట్టితో కాని, అర్ధగోలాకృతిగా నిర్మించిన సమాధి వంటి నిర్మాణములకు మాత్రమే వాడబడినది. స్తూపమునే బౌద్ధులు చైత్య మనియు వ్యవహరించు చుండిరి. బుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, అర్హతులు, చక్రవర్తులు - వీరికి మాత్రమే స్తూపము నిర్మింప వచ్చును అని బుద్ధుడే శాసించినట్లు 'మహా పరి నిర్వాణ సూత్ర'మున తెలుపబడి యున్నది. కాని కాలక్రమమున విఖ్యాతులైన బౌద్ధాచార్యులకు గూడ బౌద్ధులు ఈ గౌరవము ఇచ్చినట్లు పురాతత్వ శాఖవారి పరిశోధనల వలన రుజువగు చున్నది.
స్తూపములు త్రివిధములు. అవశేషధాతువులపై కట్టిన స్తూపములకు ధాతుగర్భములు లేదా శారీరకస్తూపములు అనియు, బుద్ధుడు సంచరించిన పవిత్ర క్షేత్రములందు ధాతు రహితముగా కేవలము స్మారక చిహ్నములుగా కట్టినవానికి ఉద్దేశిక స్తూపములనియు, ఆచార్యపాదులు ఉపయోగించిన భిక్షాపాత్ర, పాదుకలు మొదలగు పారిభోగిక వస్తువులను పదిలపరచి, ఆ ప్రదేశములపై కట్టిన స్తూపములకు 'పారిభోగిక' స్తూపములు అనియు పేర్లు. భక్తులైన బౌద్ధ శిల్పుల సిద్ధహస్తములలో స్తూప నిర్మాణము ఒక కళయై క్రమపరిణామము పొంది వాసి కనినది.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



అమరావతి
తెలుగు దేశము నేడు బౌద్ధావశేషములకు నిలయము. ఇట్టి వానిలో ప్రపంచ ఖ్యాతి పొందినది ధనకటక మహాచైత్యము. దీనిని ఇప్పుడు అమరావతీ స్తూపము అందురు. అమరావతి గుంటూరు మండలమున కృష్ణానదీ తీరమున గుంటూరికి ఇరువదిరెండు మైళ్ల దూరమున కలదు. ఆంధ్ర శాతవాహనులకు రాజధానియై విఖ్యాతి వహించిన ధన కటకము అమరావతికి శివారు గ్రామమై దానికి మైలు దూరముననే నేడు ధరణికోట అను పేర పరగుచున్నది. దీనికి ధాన్యకటకమని కూడ నామాంతరము కలదు.
మొట్టమొదట క్రీస్తు శకము 1797 కల్నల్‌ కాలిన్‌ మెకంజీ అమరావతికి వచ్చి ఇచ్చటి స్తూప శిల్పములను చూచి వాని విలువను గుర్తించి పత్రికలకు వ్రాసెను. అతడు అమరావతికి వచ్చుటకు కొద్ది సంవత్సరములకు పూర్వము శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అను జమీన్‌దారుడు తన రాజధానిని చింతపల్లి నుండి అమరావతికి మార్చి ఇక్కడ ఒక పట్టణమును, తాను నివసించుటకు గొప్ప భవనమును నిర్మించుకొనుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు కావలసిన రాతికొరకు అమరావతికి పడమరగా చేరువనున్న పురాతన నగరమయిన ధరణికోట యొక్క గోడలను, అందలి దిబ్బలను త్రవ్వించెను. అట్లు త్రవ్వించిన దిబ్బలలో దీపాల దిన్నె ఒకటి. దీనిలోనే పూర్వపు బౌద్ధస్తూపము ఉండెను. అతని జనము ఈ స్తూపమునుండి పెద్ద పెద్ద యిటికలను, పాలరాళ్లను త్రవ్వించి తీసికొని పోయిరి. అత్యంత రమణీయముగా నున్న శిల్పఫలకములను గూడ కాల్చి సున్నము చేసిరి.
తరువాత మెకంజీ 1816 లో మరల అమరావతికి వచ్చి స్తూప శిల్పములను చూచి, వానికి నమూనాలు వ్రాసి ప్రాచుర్యము కలిగించెను. కొన్ని శిల్ప శిలా ఫలకములను ఏరి 1819 లో అతడు కలకత్తాకు పంపెను. అటుతరువాత, ఒక భవనమును కట్టి దానిలో భద్రపరచు తలంపుతో అమరావతినుండి మరికొన్ని రాళ్లు మచిలీపట్టణమునకు కొనిపోబడినవి. అవి పదునెన్మిదేండ్లవరకు అక్కడనే ఉండెను. గుంటూరు కమీషనర్‌గా నియమించబడిన సర్‌ వాల్టర్‌ ఇలియట్‌ 1845లో అమరావతికి వచ్చి మరల స్తూపమువద్ద త్రవ్వింపగా అంతకు పూర్వము స్పృశింపని కొంత భాగము బయటపడినది. కాని ఈ భాగమునకు సంబంధించిన రాళ్లు అప్పటికే అవి ఉండవలసిన స్థలములో లేవు. ఇలియట్‌ ఈ శిల్పపురాళ్లలో చాలభాగము మద్రాసుకు పంపెను. అక్కడ చాల సంవత్సరములు అవి వానకు తడిసి, ఎండకు ఎండిన మీదట ఇంగ్లండుకు పంపబడినవి. 1856లో అవి లండను చేరినవి. అవి లండనులో సామాను వేసికొను గిడ్డంగి వంటి గృహములో ఉండగా 1867లో సుప్రసిద్ధ ఆంగ్లేయ కళాతత్వవేత్తయు, విమర్శకుడును అయిన ఫెర్గుసన్‌ వానిని చూచి, వాని సౌందర్యమునకు అచ్చెరు వంది వానినిగూర్చి ఒక ఉద్గ్రంథమును ప్రకటించెను. ఫెర్గుసన్‌ పుస్తకముతో అమరావతీ శిల్పములకు అమిత ఖ్యాతి వచ్చినది. ఇంగ్లండుకు పంపబడిన ఈ శిల్పపు రాళ్లను నేటికిని బ్రిటిష్‌ మ్యూజియములో చూడవచ్చును. ఇంగ్లండుకు పంపినవి కాక మద్రాసు కేంద్ర వస్తు ప్రదర్శనశాలకు పంపినవి కొన్నింటిని నేటికిని మద్రాసు వస్తు ప్రదర్శనశాలలో చూడవచ్చును. రాబర్ట్‌ సుయెల్‌ 1877 లో ఈ స్తూప ప్రదేశమువద్ద త్రవ్వించి మరికొన్ని శిల్పపురాళ్లను బయటికి తీసెను. వీనినిగురించు ఇతడు ఒక పుస్తకమును గూడ ప్రచురించెను. 1881లో జేమ్సు బర్జెస్‌ను పురాతత్వశాఖవారు ఖనన పరిశోధన నిమిత్తము అమరావతికి పంపిరి. కాని అప్పటికే స్తూపము నాశనమైనది. బర్జెస్‌ అక్కడి శిలా ఫలకములను సురక్షితముగా మద్రాసుకు చేర్చెను. క్రీ. శ. 1905-06, 1908-09 లో అలెగ్జాండర్‌ రే దొర కావించిన ఖనన పరిశోధనలకు ఫలితముగా మరికొన్ని శిలాఫలకములు బయల్పడినవి. అమరావతీ స్తూపమునకు చెందిన శిలాఫలకములు పెక్కులు లండనులోని బ్రిటిష్‌ మ్యూజియమునందును, మద్రాసు మ్యూజియము నందును, కొన్ని కలకత్తాలోని ఇండియన్‌ మ్యూజియము నందును, మిగిలిన శిథిలములు అమరావతి యందును పదిల పరుపబడి యున్నవి. అమరావతీ స్తూపము యొక్క నిర్మాణకాలమును సరిగా నిర్ణయించుటకు అందు దొరకిన శాసనములే ముఖ్యాధారములు. మౌర్య లిపిలోను, సాతవాహనుల, ఇక్ష్వాకులనాటి లిపులలోను ఉన్న శాసనముల వలన ఈ స్తూపము మౌర్యుల కాలము నుండియు విఖ్యాతిలో ఉండి దక్షిణాపథపతులైన సాతవాహనుల కాలమునను, అటు తర్వాతను అభివృద్ధి పొంది ప్రజల గౌరవాదరములను పొందుచు వచ్చినట్లు ఊహింపవచ్చును. కాలక్రమమున ధాన్యకటకమునకు దశ తొలగి పోయినది. క్రీ. శ. నాలుగవ శతాబ్దము నాటికే ఈ మహాచైత్యము ప్రభ క్షీణించుటకు ఆరంభించినది. చీనా యాత్రికుడైన యువా\న్‌ చ్వాంగ్‌ ఏడవ శతాబ్దములో ఆంధ్ర దేశమునకు అరుదెంచునప్పటికే ధాన్య కటకమున నుండిన సంఘారామములు అనేకము సంఘ పరిత్యక్తములై పాడుపడిపోయినవి. బౌద్ధమతమున తాంత్రిక సంప్రదాయము ప్రబలుటతో ఆ మతము తన విశిష్టతను కోల్పోవుటయే కాక, ఆ పద్ధతిని ఆదరించిన వజ్రయాన బౌద్ధాచార్యులు చీడపురుగులుగా భావింపబడిరి; బౌద్ధారామములు అన్నియు లంజ దిబ్బ లనుపేర కళంకితములుగా నిలిచిపోయినవి.
నేడు అమరావతీ స్తూపము అందలి శిల్ప చిత్రముల యోగ్యతవలననే విశ్వవిఖ్యాతి గాంచినది. ఈ స్తూపము నందలి చెక్కడపు పనులు నాటి ఆంధ్ర శిల్పుల పవిత్ర మతాభినివేశనమునే కాక, వారి కళా కోవిదత్వమును కూడ చాట జాలియున్నవి. ఇంత అద్భుత సృష్టి చేసిన శిల్పులు స్వోత్కర్ష ప్రకటనయందు ఆసక్తి లేనివారు కనుకనే వారు తమ నామములను కూడ ఎక్కడను చెక్కు కొనలేదు.
ఖనన పరిశోధనలందు లభించిన స్తూప ప్రతి బింబముల సాయమునను, చరిత్ర దృష్టితో కూడిన భావనా బలము వలనను కల్నల్‌ కాలిన్‌ మెకంజీ మున్ను ఎన్నడో కాల విపర్యయమున శిథిలమై భూగర్భస్థమైన మహా చైత్యము యొక్క ఆకృతిని పునర్నిర్మింప గలిగెను. నేడు గుండ్రముగా కన్పట్టు గుంటయందే పూర్వము ఒకప్పుడు 138 అడుగుల వ్యాసము, 100 అడుగుల ఎత్తు కలిగి శిల్పాలంకార శోభితములైన పాలరాతితో ఈ స్తూపము విరాజిల్లు చుండెడిది. ఈ నిర్మాణములోని రాళ్లను బట్టి ఈ స్తూపము వృత్తాకారము గల వేదిక, దానిపైన అర్ధ గోలాకృతితో ఉండిన అండము, దానిమీద హర్మిక, దానిపై కేతన విరాజితమైన దండాంచిత చ్ఛత్రము అనెడి అంగములతో కూడి ఉండెడిదని తెలియుచున్నది. వేదికమీది అండమునకు నాల్గువైపుల 'ఆయక'వేదికలు, వానిపై 'ఆయక' స్తంభములు అను పేరు గల ఐదేసి స్తంభములు కూడ గలవు. 'ఆయక' స్తంభ ప్రతిష్ఠాపనము ఆంధ్ర దేశమందలి బౌద్ధ స్తూపముల విశిష్టత. వేదిక చుట్టును 'ప్రదక్షిణ పథము'ను, దానిని ఆవరించి ప్రాకారమును ఉండెడివి. ఈ ప్రాకారము నిలువు రాతికంబములకు ఎడ నెడ, అడ్డముగా జొనిపిన రాతి కమ్మలతోను, స్తంభోపరిభాగమున మదురుగా ఉండు రాతి దూలములతోను నిర్మితమై ఉండినది. అడ్డు కమ్మికి 'సూచి' అనియు, మదురు రాతికి 'ఉష్ణీష' మనియు పేర్లు. సూచీ స్తంభోష్ణీషములు అతి మనోహరములైన దివ్య ప్రతిమా సంపదతో ఒప్పారుచుండినవి. ఈ ప్రాకారరేఖకు నాల్గు వైపుల నాల్గు సింహద్వారములు ఉండెడివి.
బౌద్ధము ఆంధ్ర దేశమునందు ప్రబలిన క్రీ. శ. ఆరంభ శతాబ్దముల నాటి ఆంధ్రుల ఆచారవ్యవహారములును వస్త్రాభరణములు, అలంకారములు మొదలగునవియు సవిస్తరముగా తెలిసికొనుటకు ఈ స్తూపపు రాళ్ల మీది చిత్రములే ఆధారములు. (చూడు: అమరావతి)
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



భట్టిప్రోలు
ఇది గుంటూరు మండలమందు రేపల్లె తాలూకాలో ఉన్న చిన్న గ్రామము. ఈ గ్రామమునకు దక్షిణమున లంజదిబ్బ అని వ్యవహరింపబడు దిబ్బ బౌద్ధస్తూపము. ఇది క్రీ. శ. 1870 లో ప్రథమమున బాస్వెల్‌ చే కనుగొనబడినది. అటు తర్వాత క్రీ. శ. 1871 లో ఇలియట్‌ దీనిని గూర్చి ప్రభుత్వమునకు వ్రాసెను. ఈ స్తూపములోని ఇటికలుగూడ పరిమాణమునందును, మన్నికయందును, అమరావతి స్తూపములోని వానివంటివి అగుటచే రస్తాల నిర్మాణమునకును, కృష్ణానది కాలువలను కట్టుటకును విరివిగా ఉపయోగింపబడినవి. అటు తర్వాత రాబర్ట్‌ సుయెల్‌ దీనిని దర్శించి స్తూపము ప్రాముఖ్యమును, దాని శిథిలావస్థను గూర్చి ప్రభుత్వమునకు తెలియజేయగా పురాతత్వశాఖ సూపరింటెండెంటుగా నున్న అలెగ్జాండర్‌ రే 1882 లో ఈ స్తూప స్థలమునందు త్రవ్వటపు పరిశోధనలు చేయించిరి. ఆ ఖనన పరిశోధనలకు ఫలితముగా శిథిలము కాగా మిగిలిన స్తూపాకారము బయలు పడినది. స్తూపము మధ్య భాగమునందలి ఇటికలు తీయగా లోపల నిక్షిప్తమైన శిలాపేటికలు మూడు దొరకినవి. ఈ పేటికలలో స్వర్ణపుష్పములు, నాణెములు, రత్నములు మొదలగునవి కానవచ్చినవి. వానిని మద్రాసు మ్యూజియమునందు కాననగును. ఈ పేటికలపై నున్న శాసనములను బట్టి ఈ స్తూపముల నిర్మాణ కాలమును సరిగా నిర్ణయించుటకు వీలగు చున్నది. ఇవి దక్షిణ మౌర్య లిపియందు లిఖింపబడి యుండుటచే బూలర్‌ దొర ఇవి క్రీ. శ. రెండువందల సంవత్సరములనాటివి అయియుండవచ్చునని ఊహించెను. స్తూపాలంకరణములకయిన చెక్కడపు రాళ్లు అన్నియు కాలువ తూముల నిర్మాణమునందు ఉపయోగించుటచే నేడు మనకు ఏవియు లభ్యమగుటలేదు.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



గంటసాల
ఇది కృష్ణ జిల్లా దివితాలూకాలో మచిలీపట్టణమునకు పశ్చిమముగా 13 మైళ్ళ దూరమున కలదు. 'కంటకసేల' అను నామముతో క్రీస్తు శకము తొలిశతాబ్దములందు సుప్రసిద్ధమైన రేవుపట్టణముగా విలసిల్లిన ఈ గ్రామము నేడు, సముద్రమునకు దూరమై పేరు ప్రతిష్టలు లేని పల్లెటూరైనది. ఇందు పూర్వకాలమునాటి వర్తకవాణిజ్యములకు సాక్షీభూతముగ యవన, రోమక నాణెములు ఇప్పటికిని దొరకుచున్నవి. ఈ గ్రామమునకు ఈశాన్యభాగమున లంజదిబ్బలు అను పేరుగల దిబ్బలు బౌద్ధస్తూపములు. వీనినిగూడ బాస్వెల్‌ 180(?) లో గుర్తించి వీనికి ప్రాచుర్యమును కలిగించెను. 192 అడుగుల రాపకముతో 23 అడుగుల ఎత్తున చక్రాకృతి నున్న ఈ దిబ్బ 1892 లో పరిశోధింపబడినది. ఇందు ఖనన పరిశోధనలుచేసి స్తూపము యొక్క వేదిక పునాదులను, సౌష్ఠవము చెడకుండ బయల్పరచి, అలగ్జాండర్‌ రే ఈ స్తూపము అమరావతీ స్తూపముకంటె కొంచెము అర్వాచీనమైన దినియు, నమూనాను బట్టి ఇది సింహళద్వీపములోని స్తూపములను బోలి యున్న దనియు వ్రాసిరి. ఇందుకూడ స్వర్ణపుష్పములు, మౌక్తికములు, వజ్రములు గల శిలాపేటిక లభించినది. స్తూపాలంకరణ శిల్పము లన్నియు, గృహనిర్మాణములకై తీసికొనిపోయినవి పోగా, మిగిలినవి ప్రక్కగ్రామములకు తరలింపబడినవి.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



గుడివాడ
కృష్ణా మండలమున ఈ గ్రామము మచిలీపట్టణమునకు వాయవ్యముగ ఇరువదిమైళ్ళ దూరమున కలదు. ఇది చారిత్రకప్రశస్తి గాంచిన పట్టణము. ఈ గ్రామములో 'కోట' యను ప్రదేశమున ఆంధ్రశాతవాహనరాజుల నాటి నాణెములు పెక్కు లభించినవి. ఇచ్చటి స్తూపమునుగూడ బాస్వెల్‌ తొలుదొల్త గుర్తించెను. తర్వాత ఈ స్తూపమును పరిశీలించిన రాబర్ట్‌ సుయెల్‌ ఈ స్తూపము ఆకారమున 'సాంచీ' స్తూపమును పోలియుండు ననియు, ఈ స్తూపము కూడ బెజవాడనుండి బందరుకు రస్తా వేయుసమయమున ధ్వంసము చేయబడినదనియు, ఆ త్రవ్వటములో కొన్ని శిలాపేటికలు గూడ లభించిన వనియు వ్రాసెను. క్రీ. శ. 1892 లో అలగ్జాండర్‌ రే శాస్త్రోక్త పద్ధతిని సుమారు 142 అడుగుల చదరము కలిగి సంపూర్ణముగ కన్పట్టు దిబ్బను త్రవ్వి స్తూపాకృతిని బయలు పరపజూచిరి. కాని స్తూప ప్రదేశమునను దానికి చెందిన విహారస్థలములందును గృహములు నిర్మించియుండుటచే అట్లు చేయ వలనుపడలేదు. ఆయన స్తూపము పునాదులను మాత్రము బయలు పరచిరి.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



జగ్గయ్యపేట
ఇది కృష్ణజిల్లా నందిగామ తాలూకాయందు బెజవాడకు సుమారు 40 మైళ్ళ దూరమున ఉన్నది. ఇచ్చటి బౌద్ధావశేషములు అన్నియును ఈ గ్రామమునకు చెంతనే ఉన్న కొండమీద కలవు. ఇందు పెక్కు ఉద్దేశిక స్తూపములు, చైత్యములు, సంఘారామములు బర్జెస్‌ దొర గారచే క్రీ. శ. 1882 లో బహిర్గతము చేయబడినవి. 'ఇందలి మహాచైత్యము వ్యాసము 31.5 అడుగులు. దీని చుట్టు 11.5 అడుగుల వెడల్పుగల ప్రదక్షిణపథము కలదు. దీని వేదికయెత్తు 3.5 అడుగులు. వేదికచుట్టు ఫలకములతో అలంకృతమై యున్న' దని బర్జెస్‌ చెప్పినాడు. రీతిలో ఇందలి శిల్పములు అమరావతీ స్తూప శిల్పముల కంటె భిన్నములై అజంతాగుహలలోని కుడ్యచిత్రములకు సన్నిహితములుగ ఉన్నవి. ఇందలి శిల్పములు అన్నిటిలో శ్రీ పాదములకై చెక్కిన 'పుణ్యశాల' కడు రమ్యమైనది. స్తూపపు రాళ్లమీద చెక్కిన శాసనములను బట్టి ఈ స్తూపము కూడ అమరావతి, భట్టిప్రోలులందలి స్తూపములవలె మౌర్యుల కాలమునాటిదని ఊహింపబడినది. అమరావతీ స్తూపమువలెనే, ఈ స్తూపముకూడ తర్వాతికాలమందు, ముఖ్యముగా ఇక్ష్వాకులపాలనలో పెంపొందింపబడినట్లు శాసనములవల్ల తెలియుచున్నది. ఇచ్చట ఖనన పరిశోధనలందు లభించిన శిలాఫలకములు కూడ మద్రాసు మ్యూజియమునందు భద్రపరుపబడినవి.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



గుంటుపల్లి
అతి ప్రాచీనములైన బౌద్ధ గుహావిహారములలో గుంటుపల్లి బౌద్ధారామము ఒకటి. గుంటుపల్లి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తాలూకాలో కామవరపు కోటకు ఆరుమైళ్ళ దూరమున ఉన్న జైందారీ గ్రామము. ఈ గ్రామమునకు ఉత్తరమున ఉన్న కొండ కొసయందు, కొండలలో మలిచిన చైత్యాలయములను, విహారములను, ఇటికతో కట్టిన స్తూపములను, చైత్యములను పెక్కింటిని క్రీ. శ. 1889 లో అలగ్జాండర్‌ రే త్రవ్వి బయల్పరచెను. ఈ యన్నింటియందును కొండలలో రాతిలో మలచిన స్తూపచైత్యము ముఖ్యమైనది. ఈ గుహాలయమున 18 అడుగుల వ్యాసముగల వృత్తాకారవేదికపై 18 అడుగుల వ్యాసము, 14 అడుగుల ఎత్తుగల శిలానిర్మితమైన స్తూపమును, దాని చుట్టును మూడడుగుల వెడల్పున 'శ్రీవీథి'యు గలదు. హర్మికోపరితలమున నిర్మించిన దండాంచిత ఛత్రము మాత్రము శిథిలమైనది. ఈ గుహాలయము యొక్క పైకప్పు భాగము అన్నిటికంటె చిత్రమైనది. ఇది దారుమయ నిర్మాణపద్ధతిని అనుకరించుచు అర్ధగోళాకృతిని నిర్మింపబడినది. ఛత్రమునకు వలె దీని యందును రాతిలో ఊచలు మలచబడినవి. అశోకుని కాలమున బుద్ధగయ వద్ద బరాబరు కొండలలో మలచబడిన 'లోమక ఋషి' గుహాలయము రీతినే ఇదికూడ నిర్మింప బడుటచేతను, క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దము నాటి లిపిలో ఉన్న ఒక శాసనము లభించుటచేతను ఇది ఆ కాలము నాటిదని రూఢిగా చెప్పవచ్చును. ఈ బౌద్ధ సంఘారామము కూడ తరువాతి కాలమందు అభివృద్ధి చేయబడినది. ఇందు దొరకిన శిలా విగ్రహములు, రాతి బరిణెలు, బంగారపు భిక్షాపాత్ర, పూసలు మొదలైన వన్నియు నేడు మద్రాసు మ్యూజియమునందు చూడనగును.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



రామతీర్థము
ఇది విశాఖపట్టణము జిల్లాలో విజయనగరమునకు ఈశాన్యమున 8 మైళ్ళ దూరమున గలదు. క్రీ. శ. 1908-09 లో అలెగ్జాండర్‌ రే పరిశోధనల ఫలితముగ గురుభక్తుల కొండ, దుర్గ కొండ అను నామములతో వ్యవహరింపబడు కొండయొక్క కోనలందు ప్రాచీన బౌద్ధ సంఘారామమునకు సంబంధించిన అవశేషములు - స్తూపములు, చైత్య గృహములు,' భిక్ఖు'ల ఆవాసగృహములు, వారు ఏర్పరచుకొన్న నీటి వసతులు మొదలగునవు - బయలు పడినవి. ఇచట త్రవ్వునపుడు లభించిన వానిలో పూజలుకల కుండలు, నాణెములు, బంకమట్టితో చేసిన ముద్రికలు ప్రధానములు. ఇందు లభించిన సీసపు నాణెముల మీదను, మట్టిముద్రికల మీదను 'సిరి సివమక విజయరాజ సేల సంఘస' అని శాసనము కలదు. దీని 'సిరి సివమక విజయ' రాజు చేత పోషింపబడిన 'శైల సంఘ' మని అర్థము చెప్పవచ్చునేమో! అమరావతి శాసనము లందు ఒక దానిలో 'రాఞో సివమక సద' అను రాజు పేర్కొన బడియున్నాడు. సాధారణముగా నాణెముల మీద సైతము కానవచ్చు 'రాఞో' పదము ఇక్కడ దొరకిన మట్టి ముద్రికల మీద కానరాదు. అయినను విజయరాజ పదమును బట్టి అతడు రా జనియే ఊహింపవచ్చును. అ ట్లయినచో, ఇతడు ఆంధ్ర శాతవాహన రాజయి ఉండ వచ్చును. దీనిని అనుసరించి ఇచ్చటి బౌద్ధ సంఘారామము ఆంధ్ర శాతవాహనుల నాటిదై ఉండునని తలచుచున్నారు. 8, 9శతాబ్దముల నాటివని నిశ్చయింపబడిన విగ్రహములను బట్టి 9 వ శతాబ్దమువరకు గూడ ఈ సంఘారమము ఉచ్చస్థితిలో ఉండినట్లు తెలియుచున్నది.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



శాలిహుండము
శ్రీకాకులము జిల్లాలో వంశధార ఒడ్డున ఉన్నది ఈ గ్రామము. దీని దగ్గర కొండపై ఉన్న బౌద్ధావశేషములు కూడ త్రవ్వి బయల్పరుప బడినవి. ఉన్నతమైన ప్రదేశమందు నిర్మింపబడిన ఈ స్తూపరాజము చూపరులకు వింత కొల్పుచు, కళింగపట్టణపు రేవునకు వచ్చిన వణిక్‌ ప్రభువుల నందరిని ఆకర్షించుచుండెడిదట. ఇచ్చట స్తూపమందు నిక్షిప్తమైన ధాతుపేటికలు స్ఫటికముతో చేయబడినవి. స్తూపాకృతినున్న ఈ పేటికలందు స్వర్ణ పుష్పములుగూడ లభించినవి. ఇవి నేడు విశాఖపట్టణమందలి పురాతత్వశాఖవారి కార్యాలయములో భద్రపరుపబడి యున్నవి. (చూడు: శాలిహుండము)
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



సంకారము
బొజ్జన్న కొండ అను నామాంతరము కల ప్రాచీన బౌద్ధస్థలము విశాఖపట్టణము జిల్లాలో అనకాపల్లి రైలుస్టేషనుకు రెండుమైళ్ళ దూరమున కలదు. శిల్పములతో విరాజిల్లు ఈ గుహాలయము రెండంతస్తులు కలది. చైత్యాలయ ద్వారోపరి భాగమున ధ్యానసమాధిలో ఉన్న పురుష ప్రమాణము గల బౌద్ధ విగ్రహము కలదు. 30 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు గల ఈ గుహాలయము 2 అడుగుల చదరము గల 16 స్తంభము లాధారముగా నిల్చియున్న రాతిలో మలచబడినది. నాలుగడుగుల ఎత్తుగల ఏకశిలా నిర్మితమైన స్తూపము ఒకటి ఆలయ మధ్యభాగమున కలదు. ఈ గుహాలయములకు పైగా కొండమీద ఇటికలతో నిర్మితమైన స్తూపములు, చైత్యములు, 'భిక్ఖు' నివాసయోగ్యములైన గదులు కూడ బయల్పడినవి. ఖనన పరిశోధనలందు ఇచట పెక్కు నాణెములు, బంకమట్టితో చేసిన ముద్రలు లభించినవి. ఇచట దొరకిన నాణెములలో గుప్త చక్రవర్తియైన సముద్ర గుప్తుని బంగారు నాణెము ముఖ్యమైనది.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



అల్లూరు
ఇది కృష్ణజిల్లా నందిగామ తాలూకాలో ఎర్రుపాలెం రైలుస్టేషనుకు నాలుగుమైళ్ళ దూరమున కలదు. ఈ గ్రామమునకు వాయవ్యముగా అరమైలు దూరమున ప్రాచీన స్తూపావశేషములను గుర్తించి, 'మహమ్మద్‌ ఖురైషీ' గారు 1926 లో దీనిని త్రవ్వి శోధించిరి. ఈ స్తూపము పునాది చక్రమునకు వలె ఆకులు కలిగి, గుండ్రమైన ఆకృతిలో ఉన్నది. మధ్యభాగము మాత్రము 32('remove in html)'8" వ్యాసము గల ఘన నిర్మాణము. ఈ నిర్మాణమున ఉపయోగించిన ఇటికలు కూడ అమరావతీ స్తూపములోని వానివలె 22" పొడవు గలవి. స్తూపవేదిక నాల్గు దిక్కులందు ముండునకు పొడుచుకొని వచ్చినట్లు కట్టిన 'ఆయక' వేదికలు గలవు. స్తూపముచుట్టును చప్టా చేయబడిన 10.5 అడుగుల వెడల్పుగల 'శ్రీవీథి' కలదు. ఇందు శిథిలములైన పాలరాతి శిల్పఫలకములు, బ్రాహ్మీలిపిలో ఉన్న శాసనములు గల శిలాస్తంభములు మొదలగునవి దొరకినవి. శాసనముల ఆధారమున ఈ స్తూపము క్రీ. శ. రెండవ శతాబ్దము నాటిది అని పురాతత్వ విదులు నిర్ణయించిరి.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



గుమ్మడిదుర్రు
ఈ గ్రామము నైజాము సంస్థానమున మధిర రైలు స్టేషనుకు ఆరుమైళ్ళ దూరమున ఉన్నది. గ్రామమునకు తూర్పుగా సుమారు నూరడుగుల ఎత్తున సమతలముగా నున్న తిప్పపై బౌద్ధావశేషములు ఉన్నట్టు గుర్తించి పురాతత్వశాఖ వారు 1926 లో దానిని త్రవ్వి బయల్పరచిరి. ఈ తిప్ప మూడు భాగములుగ విభజింపబడినది. అన్నిటికంటె ఎత్తయిన ప్రదేశమందు మహాస్తూపమును, దానికి దక్షిణముగా పెక్కు ఉపస్తూపములును, వీనికి పశ్చిమముగా నాల్గడుగుల దూరమున 'భిక్ఖు'ల ఆవాసములును నిర్మింపబడి ఉన్నవి. మహాస్తూపము అమరావతీ స్తూపమువలె శిల్ప ఫలకములతో అలంకరింపబడినది. శిల్పము లన్నియు పాలరాతితో చెక్క బడినవే. స్తూప ప్రతిమలు, బుద్ధుని జాతక కథలు చెక్కిన శిల్ప ఫలకము లెన్నియో ఇందు లభించినవి. ఆంధ్రరాజులనాటి శాసనములు, సీసపు నాణెములు, రాతి పూసలు, మధ్యయుగము నాటి ముద్రలు, బంగారు హారము, రజత పేటికలు కూడ లభించినవి. నిర్మాణ రీతినిబట్టియు, శాసన లిపిని బట్టియు ఈ స్తూపము క్రీ. శ. 2, 3 శతాబ్దముల నాటిదని నిర్ణయించిరి.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



నాగార్జునుని కొండ
అమరావతి తరువాత ప్రాచీనాంధ్ర బౌద్ధక్షేత్రములలో సుప్రసిద్ధమైనది నాగార్జునుని కొండ. ఇది గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలో మాచెర్ల స్టేషనుకు 14 మైళ్ళ దూరమున ఉన్నది. ఇచ్చటి బౌద్ధావశేషము లన్నియు విశాల మగు లోయయందు ఉన్నవి. ఈ ప్రదేశమును తొలుదొల్త 1925 లో శాసన పరిశోధన శాఖకు చెందిన ఎ. రంగస్వామి సరస్వతి గారు శిథిలమైన బౌద్ధస్తూపపు దిబ్బయొద్ద ప్రాచీన బ్రాహ్మీ శాసనములు గల స్తంభమును గుర్తించి స్థల ప్రాశస్త్యమును గూర్చి ప్రభుత్వమునకు తెలియజేసిరి. తదుపరి, ఇచట మహమ్మదు ఖురైషీ గారు చేసిన ఖనన పరిశోధనకు ఫలితముగ 18 ప్రాచీన శాసనములు, రెండు శిథిలాలయములును, అనేకమగు అమూల్య శిల్ప ఫలకములును బయల్పడినవి. అటుతర్వాత 1927 నుండి 1931 వరకు లాంగ్‌హర్‌స్టు దొర, టి.యన్‌ రామచంద్రన్‌ గారు ఈ ప్రాంతమున జరిపించిన త్రవ్వటము మూలమున ఇటికలతో నిర్మింపబడిన స్తూపములు, సంఘారామములు, చైత్య గృహములు, శిలా స్తంభయుతము లయిన మండపములు పెక్కు బహిర్గతములైనవి. ఇచ్చట దొరకిన శిల్ప సంపద యంతయు, ఇందు ప్రత్యేకముగా నిర్మింపబడిన వస్తుప్రదర్శన శాల యందు పరిరక్షింపబడి ఉన్నది.
అమరావతి స్తూపము వలెనే ఇది కూడ కొంచె మించుమించుగ ఆ కాలముననే నిర్మింపబడి తర్వాత ఇక్ష్వాకురాజుల ఆదరమున క్రీ. శ. మూడు నాలుగు శతాబ్దములందు పెంపొందింపబడినది. ఇక్ష్వాకువంశజుడగు 'చాంతమూలు'ని సోదరి 'శాంతిశ్రీ' ఈ మహాస్తూపోద్ధరణ చేయుటయే కాక దాని కెదురుగ ఒక విహారమును 'అపర మహావినసేలి'యుల ఉపయోగార్థము కట్టించెను. ఈ స్తూపములు త్రవ్వుచుండగా అండము యొక్క మధ్యభాగమున నొక మట్టి పాత్రలో రజత కరండమున నిక్షిప్తమై యున్న బుద్ధధాతువు దొరికినది. ఇది బటాణీ గింజంత పరిమాణముగల ఎముక ముక్క. దీనిని 3/4" వ్యాసము గల బంగారు బరిణెలో మౌక్తిక స్వర్ణపుష్పములతో కూడ పెట్టి, దానిని మరల స్తూపాకృతినున్న రజతకరండమున పదిల పరచినారు. ఈ బౌద్ధధాతువు నేడు 'సార్నాథ్‌' లోని 'మూల గంధకుటీ విహారము'న పూజింపబడుచున్నది.
నాగార్జునుని కొండ ప్రదేశము నేడు పాడుపడి బీడుపారి పోయినది. శంకరాచార్యులవారు సపరివారముగ ఇచటికి విచ్చేసి బౌద్ధుల నందరిని తరిమివేసిరని ప్రతీతి. ఇది ఎంతవరకు సత్యమో తెలియదు.
ఖనన పరిశోధనల ఫలితముగ సుమారు 600 పెద్ద శిల్ప ఫలకములును, 400 శిథిలములైనవియును లభ్యమైనవి. ఇవి అన్నియు నేడు వస్తు ప్రదర్శనశాలలో చక్కగ అమర్చబడి యున్నవి.
ఇంకను నాగార్జునుని కొండలో త్రవ్వించవలసిన దిబ్బలు, ప్రదేశములు చాల ఉన్నవి. నాగార్జున సాగరమును కట్టినచో బౌద్ధ విహారములు, శిథిలములు మున్నగునవి పూర్తిగ మునిగిపోగలవు. కావున అక్కడ ఇంకను పరీక్షింపవలసిన ప్రదేశములను ప్రభుత్వ పురాతత్త్వ శాఖవారు త్రవ్వించుచున్నారు. ఈ త్రవ్వటము ఫలితముగ ఇదివరకు బయలు పడినవి కాక ఇంకను క్రొత్త శిథిల నిర్మాణములు మొదలైనవి బయలు పడుచున్నవి. (చూడు: నాగార్జునుని కొండ)
పై ప్రదేశములందే కాక పురాతత్వ శాఖ వారు కాపవరము, కొడవలి, ఆరుగొలను, చేజెర్ల, కనుపర్తి, ఈపూరు మొదలగు గ్రామములందు కూడ బౌద్ధావశేషములను గుర్తించి ప్రాచుర్యమును కలిగించిరి.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



దానవులపాడు
బౌద్ధము వలెనే జైనమతము కూడ తెలుగు దేశమున జనాదరణము పొండి ఎక్కువగా వ్యాపించినట్లు నేడు తెలుగు దేశమున శిథిలములై, నామమాత్రావశిష్టములైన జైనవసదుల వలన తెలియు చున్నది. బౌద్ధుల వలెనే జైనులు కూడ స్తూపాది నిర్మాణములు చేసినట్లు తార్కాణములు కలవు. కాని, తెలుగు దేశమున జైనమతమునకు సంబంధించిన స్థలములు పురాతత్వశాఖ వారిచే గుర్తింపబడి, శోధింపబడిన వానిలో దానవులపాటి జైనాలయములు ప్రసిద్ధములు. దానవులపాడు కడపజిల్లా, జమ్మలమడుగు తాలూకా యందు పెన్ననది ఒడ్డున నున్న కుగ్రామము. పెన్ననది వరద వలననో, మరే కారణముననో, ఎన్నడో ఇసుకలో కప్పబడి పోయి యున్న అక్కడి జినాలయములు ప్రప్రథమున క్రీ. శ. 1903 లో శ్రీ జయంతి రామయ్య పంతులుగారిచే గుర్తింపబడినవి. వారు వీనిని గురించి ప్రభుత్వమునకు తెలియజేయగా పురాతత్వశాఖ వారు ఆ స్థలము యొక్క పరిశోధనకు పూనుకొనిరి. ఇచ్చట కావించిన ఖనన పరిశోధనలకు ఫలితముగా పాలరాతితో చెక్కిన జిననాథుని విగ్రహము, 12 అడుగుల చదరముగల గర్భాలయము, ముఖమండపము బయల్పడినవి. వానిలో చాళుక్య లిపియందు ఉన్న శాసనములు, నాణెములు, పాలరాతిలో చెక్కబడిన చక్కని శిల్పములు కూడ లభించినవి.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



చంద్రవళ్లి
మైసూరు సంస్థానమందలి చిత్రదుర్గమునకు 1.5 మైలు దూరమున ఉన్న ఈ గ్రామమున దొరకిన నాణెములనుబట్టి ఇది క్రీస్తు శకము ప్రాథమిక శతాబ్దముల నాటి ఆంధ్ర శాతవాహనుల ముఖ్యస్థానములలో ఒకటని మైసూరు సంస్థాన పురాతత్వ శాఖాధికారులైన కె. యం. హెచ్‌. కృష్ణగారు 1940 లో ఇచ్చటను, ఈజిల్లాలోనే ఉత్తరముగా బళ్లారికి 30 మైళ్ళ దూరమున ఉన్న బ్రహ్మగిరి వద్దను ఖనన పరిశోధనలు జరిపిరి. బ్రహ్మగిరి ప్రాంతమున ఉన్న అశోకుని శాసనాధారమును బట్టియు, తనకు పరిశోధనలందు లభించిన సామాగ్రిని బట్టియు, నేడు బ్రహ్మగిరి అను పేర బరగు గ్రామమే అశోకునినాటి 'ఇసిల' అని ఆయన రూఢిగా వక్కాణించెను. బ్రహ్మగిరి కొండలకు ఆగ్నేయముగ ఒక ఫర్లాంగు దూరమున 1942 లో త్రవ్వగా బౌద్ధయుగమునాటి చైత్యగృహము ఒకటికూడ బయల్పడినది. 1947 లో ఇండియా గవర్నమెంటు పురాతత్వశాఖవారు మైసూరు పురాతత్వశాఖవారి సౌహార్దముతో ఈ ప్రదేశములందు పరిశోధనలు సాగించి బయల్పరచిన పెద్ద రాతి సమాధులు, అందు లభించిన నాణెములు, ప్రాచీన నాగరిక తావశేషములు దక్షిణదేశమున పురాతత్వ చరిత్రలో ఒక నూతనాధ్యాయమును మరల ప్రారంభించినవి. చరిత్ర రచనకు ఆవశ్యకమైన కాలక్రమమును కొంత వరకు నిర్ణయించుటకు వలసిన సామగ్రి అంతయు ఇందు లభించినది.
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



కొండాపురము
తెలుగుదేశములోని కొండాపురము సాతవాహన రాజుల కాలమునాటి మహానగరములలో ఒకటి. అక్కడను, గోదావరీ తీరమునందలి 'పైఠాను' (ప్రతిష్ఠానము-మరాటవాడ) లోను, హైదరాబాదు పురాతత్వశాఖవారు ఖనన పరిశోధనలు కావించి యున్నారు. (చూడు: కొండాపురము, పైఠాను)
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif



హంపి - విజయనగరము
నేడు హంపి అనుపేర వ్యవహరింపబడుచున్న కుగ్రామమే పంపాతీర్థమని పురాణ ప్రసిద్ధి కలిగి, సుమారు రెండువందల సంవత్సరములు చంద్ర ధ్వజమునకు ఎదురొడ్డి నిల్చి, దక్షిణ భారతమున హైందవ స్వాతంత్ర్యమును నిలబెట్టి, హిందూ మతమును ఉద్ధరించిన విజయనగర రాజన్యుల రాజధానీ నగరము. క్రీ. శ. 1336 ప్రాంతమున సంగమ వంశజు డైన హరిహరరాయలు నిర్మించిన ఈ నగరరాజము క్రమాభివృద్ధి నొంది తుళువ కృష్ణరాయల నాటికి (1509-30) మహోజ్జ్వల చారిత్రక ప్రసిద్ధి గల నగరములలోని కెల్ల మణిపూసయై విరాజిల్లినది. సప్త ప్రాకార సమన్వితమై ఉన్నతములగు ప్రాసాదములతోను, దేవాలయములతోను అత్యంత రమణీయముగ ఉండిన ఈ నగర రాజమును రక్షస తంగడి యుద్ధమున (1565) జయమొందిన తురుష్కులు పూర్తిగా ధ్వంసము చేసిరి. అట్లు నాశనమైన ఈ మహాపట్టణపు శిథిలములు నేడు హంపి, కమలాపురము, కంపిలి గ్రామముల మధ్య పెక్కు చదరపు మైళ్ళ వైశాల్యమున ప్రకృతి ఏర్పరచిన ప్రదర్శనశాలవలె నుండి చూపరులకు తమ ప్రాచీనౌన్నత్యమును జ్ఞప్తికి తెచ్చుచున్నవి.
ఈ నడుమ మద్రాసు గవర్నమెంటు వారికి తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టి అచ్చట విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి వలయు ఏర్పాట్లు కావించుటకై హంపీ శిథిల ప్రాంతమున ఒక పెద్ద జలాశయము నిర్మింపవలసిన ఆవశ్యకము కలిగినది. ఈ జలాశయ నిర్మాణము వలన కమలాపుర గ్రామ ప్రాంతమున ఉన్న విజయనగర రాజధాని శిథిలావ శేషములు గల భూ భాగము జలమయ మగుచుండుట చేత వీలయినంత వరకు ప్రాచీనావశేషములను ఉద్ధరించు సంకల్పముతో 1950 లో ఇచ్చట ఖనన పరిశోధనలు జరుప బడినవి. తత్ఫలితముగా హరిహరరాయలనాటి బంగారు నాణెములు, గృహములు, నీటితొట్లు, బావులు బయల్పడినవి. (చూడు: హంపీ శిథిలములు)
ఇంకను తెలుగు దేశములో పురాతత్వ శాఖవారు పడమటి గోదావరి, గుంటూరు, కర్నూలు మొదలైన మండలములలో త్రవ్వింపవలసిన పురాతన స్థలములు, దిబ్బలు చాల ఉన్నవి. అవి యన్నియు త్రవ్వినచో మనకు మన ప్రాచీన చరిత్రకు, కళలకు సంబంధించిన విశేషములెన్ని బయటపడునో తెలియదు.
డాక్టరు రాయప్రోలు సుబ్రహ్మణ్యం, ఎం.ఏ., పి.హెచ్‌.డి.
సూపరింటెండెంటు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆర్కియాలజీ,
నాగార్జునకొండ ఎక్సవేషన్‌ ప్రాజెక్టు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.
Description: http://www.andhrabharati.com/pics/goldleft.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif
Description: http://www.andhrabharati.com/pics/goldright.gif
·         Telugu Dictionaries
·         Sanskrit Dictionaries
·         Home
Description: http://www.andhrabharati.com/pics/mAmATa.gif
Description: http://www.andhrabharati.com/pics/bhASha.gif
Description: http://www.andhrabharati.com/pics/charitra.gif
Description: http://www.andhrabharati.com/pics/xEtramulu.gif
Description: http://www.andhrabharati.com/pics/itihAsamulu.gif
Description: http://www.andhrabharati.com/pics/kAvyamulu.gif
Description: http://www.andhrabharati.com/pics/shatakamulu.gif
Description: http://www.andhrabharati.com/pics/kavitalu.gif
Description: http://www.andhrabharati.com/pics/kIrtanalu.gif
Description: http://www.andhrabharati.com/pics/ab_logo.gif
Description: http://www.andhrabharati.com/pics/dhArmika.gif
Description: http://www.andhrabharati.com/pics/dEshi.gif
Description: http://www.andhrabharati.com/pics/strI_bAla.gif
Description: http://www.andhrabharati.com/pics/vachana.gif
Description: http://www.andhrabharati.com/pics/nATakamulu.gif
Description: http://www.andhrabharati.com/pics/lalitakaLalu.gif
Description: http://www.andhrabharati.com/pics/pramukhulu.gif
Description: http://www.andhrabharati.com/pics/avI_ivI.gif
Description: http://www.andhrabharati.com/pics/mImATa.gif
Description: http://www.andhrabharati.com/pics/goldleft.gif
తెలుగు దేశ చరిత్ర యుగ విభాగము

తెలుగుదేశ చరిత్ర (1) చరిత్ర పూర్వ యుగము, (2) చారిత్రక యుగము అని రెండు యుగములుగా విభజింపబడినది. వీనిలో (1) చరిత్ర పూర్వ యుగము చరిత్రను తెలుపుటకు లిఖితాధారములు లేని కాలము. ఇది క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దమువరకు గల కాలము; (2) చారిత్రక యుగము క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దము మొదలుకొని ఇరువదవ శతాబ్దము వరకు గల కాలము. ఈ చారిత్రక యుగము (1) పూర్వ యుగము, (2)మధ్యయుగము, (3) ఆధునిక యుగము అని మరల మూడు యుగములుగా విభజింపబడినది. వీనిలో పూర్వయుగము క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దమునుండి క్రీస్తు శకము పదునొకండవ శతాబ్దమువరకు గల కాలము; మధ్యయుగము క్రీస్తుశకము పదునొకండవ శతాబ్దమునుండి పదునేడవ శతాబ్దము వరకు గల కాలము; ఆధునికయుగము ఆ తరువాతినుండి నేటి యిరువదవ శతాబ్దమువరకు గల కాలము. ఈ చారిత్రక యుగ విభాగములు మూడింటిలో మధ్యయుగము మరల పూర్వ మధ్యయుగ మని, ఉత్తర మధ్యయుగ మని రెండుగా విభజింపబడినది. పదునొకండవ శతాబ్దము మొదలుకొని పదునాల్గవ శతాబ్దమువరకు గల కాలము పూర్వ మధ్యయుగము. ఈ యుగము క్రీ. శ. పదునాల్గవ శతాబ్దములో కాకతీయ త్రైలింగ్య సామాజ్య పతనముతో అంతమగుచున్నది. అప్పటినుండి ఉత్తర మధ్యయుగము ప్రారంభమయి క్రీస్తు శకము పదునేడవ శతాబ్దముతో అంత మొందును. ఈ యుగములు ఆయా శతాబ్దములు ఆరంభమగు కాలమునుండి అంతమగు కాలములో ఎప్పుడో ఒకప్పుడు ఆరంభమై అంతమొందునని గ్రహింపదగును.
దేశ చరిత్రలో యుగ విభాగ కాలనిర్ణయము విషయమున ఇప్పటికిని చరిత్రకారులలో అభిప్రాయ భేదములు కలవు. హిందూదేశ చరిత్రలో యుగనిర్ణయ విషయమున ఇంకను చర్చలు సాగుచునే యున్నవి. కొందరి అభిప్రాయ ప్రకారము పూర్వయుగము క్రీస్తుశకము ఏడవ శతాబ్దములో అంతమొందును. అట్లే పదునేడవ శతాబ్దముతో మధ్యయుగము అంతమగు చున్నది. ఇక అప్పటినుండి ఆధునికయుగము. మరికొందరు వే రొక తీరున నిర్ణయింతురు. ఇట్లు ఈ యుగ నిర్ణయము బహువిధముగ నున్నది. కావున మనదేశ చరిత్రలోని ప్రసిద్ధ చారిత్రక సంఘటలను పురస్కరించుకొని తెలుగుదేశ చరిత్రమునందు పైని పేర్కొనబడిన విధము ననుసరించి యుగ విభాగము చేయబడినది.
మల్లంపల్లి సోమశేఖర శర్మ
లెక్చరర్‌ ఇన్‌ ఎపిగ్రఫీ అండ్‌ న్యుమిస్‌మాటిక్స్‌
ఆంధ్ర యూనివర్సిటీ, స్టాఫ్‌ క్వార్టర్సు, వాల్తేరు
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.
Description: http://www.andhrabharati.com/pics/goldleft.gif
Description: http://www.andhrabharati.com/pics/goldup.gif